శోభానాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఆమె బుధవారం నాడు మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
'శోభా నాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. కూచిపూడి నృత్యం ద్వారా ఆమె మన సంస్కృతి గొప్పతనాన్ని విదేశాల్లో కూడా చాటారు.' అంటూ పలువురు ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటించారు.