Telugu Gateway
Andhra Pradesh

అందుకే అడ్డగోలుగా అంచనాలు పెంచారా!

అందుకే అడ్డగోలుగా అంచనాలు పెంచారా!
X

తెర వెనక ఉండి కథ నడిపించిన ఎంపీ!

అంతిమ లబ్ధిదారు ఎవరో!

విద్యుత్ శాఖలో దుమారం రేపుతున్న జెన్ కో ప్రాజెక్ట్ టెండర్ వ్యవహారం

ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పవర్ షేరింగ్ ఒక్కటే కాదు...అవినీతిలో వాటాలు కూడా అలాగే పంచుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ముగ్గురు భాగస్వాములు ఉన్నప్పుడు అన్నిటిలోనూ ఎవరి వాటా వాళ్ళకు దక్కేలా చేస్తున్నారు అని ...అందులో భాగంగానే విద్యుత్ శాఖలో తాజాగా కేటాయించిన ఒక భారీ ప్రాజెక్ట్ ను అడ్డగోలుగా అంచనాలు పెంచి మరీ కేటాయించినట్లు విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ దక్కించుకున్న కంపెనీల పేర్లు ఏవైనా కూడా ఇందులో అంతిమ లబ్ధిదారు మాత్రం కూటమిలో కీలక భాగస్వామి పార్టీ అని విద్యుత్ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీకి చెందిన ఎంపీనే తమ సన్నిహితులకు చెందిన కంపెనీ ద్వారా కథ అంతా నడిపించినట్లు విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాష్ట్రంలోని పవర్ ప్రాజెక్ట్ ల్లో చోటు చేసుకుంటున్న అవినీతిలో భాగంగానే ఆ పార్టీ కోటా కింద ఈ ప్రాజెక్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. గతంలో అసలు తమ శాఖకు చెందిన అధికారులు ఎప్పుడూ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎదుర్కొన్నంత ఒత్తిడి ఎదుర్కోలేదు అని ఆ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకునేందుకు ఎంతో ముందుగానే ఒక మెగా సంస్థ డీపీఆర్ తయారు చేయించటంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ కూటమి పార్టీ తరపున ఒక ఎంపీ రంగంలోకి దిగి విద్యుత్ శాఖలో అన్నీ మీకేనా ఇది తమకు కావాలని కోరటంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఇది తాము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని ఒత్తిడి చేయటంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ప్రాజెక్ట్ ను వాళ్లకు వదిలేసినట్లు కనిపిస్తోంది అని చెపుతున్నారు. అంతే కాకుండా ఒక్క దెబ్బకే అంతా సెట్ చేసేందుకు వీలుగా ఆ విద్యుత్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఏకంగా 5470 కోట్ల రూపాయల నుంచి 8161 కోట్ల రూపాయలకు పెంచినట్లు చెపుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జెన్ కో కు మరణ శాసనం లాంటిది అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఒక్క విద్యుత్ శాఖలోనే ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఏకంగా 20000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన వివిధ రకాల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన మంత్రి తరపున కిమ్ టీం ఈ వసూళ్లు చేపట్టినట్లు విద్యుత్ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ వసూళ్ల కోసం ఢిల్లీ తో పాటు హైదరాబాద్, అమరావతిలో ప్రత్యేక టీం లు కూడా ఏర్పాటు అయ్యాయి. వీళ్ళు అంతా తెరవెనక ఉండే పని నడిపిస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్ట్ లతో పాటు విద్యుత్ కాంట్రాక్టుల వంటి విషయాల్లో కూడా పవర్ ఫుల్ మంత్రి తరపున కిమ్ టీం అన్ని డీల్స్ చేస్తోంది. ఇవి అన్నీ తెలిసే ఇప్పుడు మరో కీలక పార్టీ తరపున ఒక ఎంపీ రంగంలోకి దిగి ఈ ప్రాజెక్ట్ ను పక్కాగా స్కెచ్ వేసి మరీ ఆ శాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తాము అనుకున్న విధంగా పని పూర్తి చేయించుకున్నట్లు చెపుతున్నారు. అయితే దీనికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు కూడా పూర్తిగా ఉండటంతో అంచనాలు అడ్డగోలుగా పెరిగిపోయి...ఈ ప్రాజెక్టు లో అవినీతి కొత్త శిఖరాలకు చేరింది అని చెపుతున్నారు. నిజంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ పార్టీకి ఎలాంటి లబ్ది లేకపోతే నీతి, నిజాయతిలకు తామే నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకునే వాళ్ళు దీనికి పై విచారణకు డిమాండ్ చేస్తారా అని విద్యుత్ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Next Story
Share it