Telugu Gateway
Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‘ రికార్డులు’

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‘ రికార్డులు’
X

రాజశేఖర్ రెడ్డి ....చంద్రబాబు...ఇప్పుడు జగన్

ఒకే టర్మ్ లో ఒకే ముఖ్యమంత్రి ఒకే ప్రాజెక్ట్ కు రెండు సార్లు శంఖుస్థాపన చేయటం అంటే అంతకు మించిన వెరైటీ మరొకటి ఉండదు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ అదే పని చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అంటే 2019 డిసెంబర్ లో కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు..తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే శంఖుస్థాపన చేశామన్నారు. మూడేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే కారణాలు ఏమైనా 2023 ఫిబ్రవరిలో మరో సారి అదే కడప స్టీల్ కు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో చంద్రబాబు కూడా ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం మొదలు కాలేదు. తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలోనే అదే. ఈ ప్రాజెక్ట్ కు 2109 లో ఫిబ్రవరి లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేశారు. జీఎంఆర్ కు ఈ ప్రాజెక్ట్ అప్పగించటం పెద్ద స్కాం అని ఆరోపించిన జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే సంస్థకు పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని.. తాజాగా ఈ నెలలోనే సీఎం జగన్ కూడా మరో సారి శంఖుస్థాపన చేశారు.

ఇప్పుడు అలాంటిదే మరో శంఖుస్థాపన. మచిలీపట్టణం ఓడరేవు. దీనికి సోమవారం నాడు సీఎం జగన్ చేయనున్న శంఖుస్థాపనతో కలుపుకుంటే ముగురు సీఎం లు ఈ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేసినట్లు అవుతుంది. తొలుత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మూడవ సీఎం గా జగన్ మరో శంఖుస్థాపన చేయబోతున్నారు. అంటే మచిలీపట్టణం పోర్టు కు ఇది మూడవ శంఖుస్థాపన అన్న మాట. ఇది అంతా చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కీలక ప్రాజెక్ట్ లు డబల్ డబల్ శంకుస్థాపనలు అయితే జరుగుతున్నాయి కానీ..పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. మరి ఈ సారి అయినా కీలక ప్రాజెక్ట్ లకు మోక్షం కలుగుతుందో లేదో వేచిచూడాల్సిందే. సహజంగా ఒక ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేస్తే వాళ్ళ హయాంలోనే..లేకపోతే కొత్త ప్రభుత్వంలోనే ప్రారంభోత్సవాలు జరుగుతాయి. కానీ అదేమీ విచిత్రమో సీఎం లు మారుతున్నారు...శంకుస్థాపనలే చేస్తూ పోతున్నారు.

Next Story
Share it