Telugu Gateway

ఏపీలో కొత్త‌గా 14 మెడిక‌ల్ కాలేజీలు

ఏపీలో కొత్త‌గా 14 మెడిక‌ల్  కాలేజీలు
X

ఏపీ ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెడుతోంది. అందులో భాగంగా సీఎం జ‌గ‌న్ సోమ‌వారం నాడు కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌గ‌న్ మాట్లాడుతూ ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలోనూ టీచింగ్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. ''మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదవారికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని'' సీఎం తెలిపారు.

Next Story
Share it