Telugu Gateway
Andhra Pradesh

జూమ్ కాల్ తో వస్తే ..ఇన్ని రాయితీలు ఎందుకో?!

జూమ్ కాల్ తో వస్తే ..ఇన్ని రాయితీలు ఎందుకో?!
X

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన తనయుడు నారా లోకేష్ చేసుకునే ప్రచారం ఒకటి. వాస్తవం మరొకటి. కొద్ది రోజుల పాటు నారా లోకేష్ తో పాటు ఆయన టీం కూడా ఒక్క జూమ్ కాల్ తో ఆంధ్ర ప్రదేశ్ కు 1 .40 లక్షల కోట్ల రూపాయల పెట్టబడులు సాధించారు. ఇక ఉద్యోగాలు వరదలా వచ్చిపడటమే అన్న కలరింగ్ ఇచ్చారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో యూనిట్ ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (ఏఎంఎన్ఎస్ఐ) యూనిట్ కు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు చూస్తే ఈ యూనిట్ ఆంధ్ర ప్రదేశ్ కు రావటం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం కంటే...ఆ కంపెనీకి కలిగే ప్రయోజనమే ఎక్కువ అన్నది అధికార వర్గాలు చెపుతున్న మాట. ఎందుకంటే చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ ఆ కంపెనీ పెద్ద ఎత్తున మేలు చేయబోతుంది. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఇదే మోడల్ ఫాలో అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూములు. రాయితీలు..పారిశ్రామిక విధానం ప్రకారం ఇవ్వటం మామూలే. కానీ ఇక్కడ చంద్రబాబు, నారా లోకేష్ మోడల్ అలా కాదు. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ దివాళా తీసింది అని చెపుతూ ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న సంస్థకు ఏపీ సర్కారు అవసరానికి మించి దోచిపెడుతుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లో మొత్తం ఏటా 17 .8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందులో తొలిదశ కింద 7 .3 మిలియన్ టన్నులు అంటే ఏటా 73 లక్షల టన్నుల స్టీల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. తర్వాత అంటే రెండవ దశలో ఏటా కోటి ఐదు లక్షల టన్నుల సామర్ధ్యంతో యూనిట్ నెలకొల్పనున్నారు. దీని కోసం ప్రభుత్వం తోలి దశ కోసం 2200 ఎకరాలు, రెండవ దశ కోసం 3800 ఎకరాలు కేటాయించనుంది. దీంతో పాటు కంపెనీ ఉద్యోగుల కోసం అవసరం అయ్యే టౌన్ షిప్ కు కూడా ప్రభుత్వం 440 ఎకరాలు కేటాయించనుంది. తొలి దశ పెట్టుబడి 56 వేల కోట్ల రూపాయలు అయితే...రెండవ దశలో కంపెనీ 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అని జీవో లో వెల్లడించారు. ఈ పెట్టుబడి ద్వారా తొలి దశలో వచ్చే ఉద్యోగాలు 20 వేలు, రెండవ దశలో 35 వేలు. ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశ 2029 జనవరికి, రెండవ దశ 2033 కి పూర్తి అవుతుంది. దీంతో పాటు కంపెనీ కోరిందే తడవుగా అంటే యూనిట్ అవసరాల కోసం ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఓడరేవు అభివృద్ధికి (క్యాప్టివ్ పోర్ట్) కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అవసరమైన భూమి ఇవ్వటంతో ఇతర అన్ని సౌకర్యాలు కూడా కల్పించబోతోంది. ఈ కంపెనీకి ప్రభుత్వం 2200 ఎకరాలను ఎకరా 51 .39 లక్షల రూపాయల లెక్కన కేటాయించనుంది.

దీంతో పాటు టౌన్ షిప్ కు అవసరమైన 400 ఎకరాలు కూడా కేటాయించనున్నారు. భారీ పెట్టుబడుల సాధన కోసం అంటూ ఈ కంపెనీకి ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చారు. ఇందులో అత్యంత కీలకమైనది కంపెనీ నిర్మాణ సమయంతో పాటు ఆ తర్వాత పదిహేను సంవత్సరాల పాటు వంద శాతం స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(ఎస్ జిఎస్ టి) రీఎంబర్స్మెంట్ చేయనున్నారు. పదిహేను సంవత్సరాల పాటు యూనిట్ విద్యుత్ కు రూపాయి మేర రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించారు. వీటితో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, పదేళ్ల పాటు కిలో లీటర్ నీటిని 50 రూపాయల లెక్కన నీటి సరఫరా కు ఆమోదం తెలిపారు. ఇవే కాకా ఇంకా ఎన్నో రాయితీలు..మినహాయింపులు ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున కంపెనీ కి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుని ఒక్క జూమ్ కాల్ తో రాష్ట్రానికి యూనిట్ వచ్చింది...మేము అడిగిందే ఆలస్యం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

Next Story
Share it