పవన్ కోసం చంద్రబాబు..లోకేష్ ల ట్విట్టర్ పోరాటం!
ఎన్టీఆర్ ను మీరు వేధించిన విషయం మర్చారా అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ట్విట్టర్ వేదికగా యుద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కూడా ఇప్పుడు అంతా వదిలేసి తన పని తాను చూసుకుంటుంటే..చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఆయన కోసం బ్యాటింగ్ చేస్తున్నారు. భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో ఎదురవుతున్న ఇబ్బందులపై చంద్రబాబు, లోకేష్ లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ వదిలిపెట్టడంలేదని..చివరకు వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడని విమర్శించారు. జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని మండిపడ్డారు. భారతి సిమెంట్ పై లేని నియంత్రణ..భీమ్లానాయక్ పై ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యలు అన్నీ వదిలేసి సీఎం మాత్రం సినిమాలపై వేధింపులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇదే తరహాలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. భీమ్లానాయక్ కు మంచి స్పందన వస్తోందని..ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ ఒక పరిశ్రమ తర్వాత ఒక పరిశ్రమను నాశనం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. భీమ్లానాయక్ ఈ కుట్రలు అన్నీ చేధించుకుని బయటకు రావాలని ట్వీట్ లో పేర్కొన్నారు. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ల వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు విన్పిస్తున్నాయి. భీమ్లానాయక్ విషయంలో వారేమీ స్పందించకపోయినా గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇబ్బందులు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
రామయ్యా వస్తావయ్యాతోపాటు పలు ఎన్టీఆర్ సినిమాలను అప్పట్లో టీడీపీ శ్రేణులు దెబ్బతీసే ప్రయత్నం చేసి చాలా వరకూ విజయం సాధించాయి. తమతో కలసి రావటంలేదనే ఏకైక కారణంతో కుటుంబ సభ్యుడు అనే విషయాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ ను దెబ్బతీయటానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం తమకు అసలు అలాంటి పనులే తెలియవన్న కవరింగ్ ఇస్తున్నారనే కొత్త చర్చకు తెరదీస్తున్నారు. ఈ భయంతోనే ఎన్టీఆర్ ఇటీవల సీఎం జగన్ దగ్గర జరిగిన సమావేశానికి కూడా దూరంగా ఉన్నారు. ఏపీ సర్కారు పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు మొత్తం మీద తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో పలు చోట్ల థియేటర్లలో ఎమ్మార్వోల ఫోన్ నెంబర్లు బహిరంగంగా అందుబాటులో ఉంచటంతోపాటు ఈ సినిమాను సాధ్యమైనంత మేర దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అమల్లో ఉన్ననిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చు. కానీ భీమ్లానాయక్ కే ఏదో కొత్త రూల్స్ పెట్టినంత హంగామా పలు థియేటరల్లో కన్పిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.