Telugu Gateway
Andhra Pradesh

అమరావతిని ఇలా చూస్తే బాధేస్తోంది

అమరావతిని ఇలా చూస్తే బాధేస్తోంది
X

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ప్రకటించిన అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశంపై స్పందించారు. విభజన నష్టాన్ని అధిగమించే సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా అమరావతిని ప్రతిపాదించినట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్లుగా నిరాఘాటంగా సాగిన నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేసి అభివృద్దిని ఆపేశారన్నారు. వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది. పోటీబడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోది ప్రసంగం, ఆ వేడుకకు హాజరైన దేశ విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారు.

అవాస్తవ ఆరోపణలతో, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేశారు. రూ 10వేల కోట్లతో చేసిన అభివృద్ది పనులను నిరుపయోగం చేశారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం రాక్షసత్వం. 13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి ఊరేగింపుగా తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన మన రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి కర్తవ్యం. రాష్ట్ర భవిష్యత్తు కోసం 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల భవిష్యత్తును అంధకారంలో ముంచిన ప్రస్తుత పాలకుల దుశ్చర్యలను నిరసించండి..రాష్ట్రం కోసం రోడ్లపాలైన అమరావతి రైతులు, మహిళలు, రైతుకూలీలకు సంఘీభావం తెలపండి. 13జిల్లాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడండి అంటూ ట్వీట్ చేశారు.

Next Story
Share it