ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బాబు అరెస్ట్ ప్రభావం ఎంత?
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ. దీనికి ప్రధాన కారణం ఎన్నికలు కూడా ఎంతో దూరంలో లేవు. తొలి సారి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అవినీతి కేసు లో అరెస్ట్ అయి జైలు కు వెళ్లారు. ఈ పరిణామం సహజంగానే అధికార వైసీపీ నేతలు, క్యాడర్ లో ఫుల్ జోష్ నింపింది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చేయలేని పని సీఎం జగన్ చేశారు అని వాళ్ళు తమ ఆనందాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ నే కాబట్టి చంద్రబాబుపై వాళ్లకు అంత కసి ఉండటం సహజమే. ఇక తెలుగు దేశం విషయానికి వస్తే వాళ్ళు ఎవరూ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఊహించలేదు. ఈ ఊహించని పరిణామంతో టీడీపీ నేతలు, క్యాడర్ షాక్ కు గురి అయ్యారనే చెప్పాలి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ క్యాడర్ లో ఆనందం వస్తే...అదే తెలుగు దేశం క్యాడర్ లో కసి పెరుగుతోంది. ఒక్కసారిగా నాయకులు, క్యాడర్ ఇప్పుడు మరింత కసితో వచ్చే ఎన్నికల్లో పని చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ధర్నాలు, ఆందోళనలు అంటూ బయటకు వస్తే ఎడా పెడా కేసు లు పెడుతుండటంతో చాలా మంది బయటకు రావటానికి భయపడుతున్నారు. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం తటస్థులు. వీరి సంఖ్య చాలా నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. ఎవరు అరెస్ట్ అయినా...కాకపోయినా అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ ఓటు బ్యాంకు ఎవరిది వారికే ఉంటుంది. ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండే ఛాన్స్ లేదు.
కానీ కొన్ని పరిణామాలు తటస్థులుగా ఉండే వారి నిర్ణయాల్లో మార్పుకు కారణం అవుతాయనే చెప్పొచ్చు. రాజకీయ కారణాలతో పాటు, ఇతర కారణాలతో కూడా చంద్రబాబు ను వ్యతిరేకించే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో కూడా కొంతమందిని వైసీపీ అధినేత, సీఎం జగన్ తన నిర్ణయాలతో ఇష్టం లేకపోయినా చంద్రబాబు వైపు మళ్లేలా చేస్తున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో కూడా సాగుతోంది. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తన ఫోకస్ అంతా టార్గెట్ చంద్రబాబు దిశగానే అడుగులు వేశారు. దీనికోసం మంత్రులతో ఉప సంఘం వేసి నివేదికలు సిద్ధం చేశారు. మరో వైపు రాజధాని అమరావతి అట కెక్కింది. జగన్ తలపెట్టిన మూడు రాజధానులు ముందుకు సాగలేదు. పోలవరం పరిస్థితి కూడా అంతే. మరో వైపు రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా మారగా..మౌలిక సదుపాయాల ఊసే లేదు. ఇవన్నీ కూడా జగన్ పై తటస్థుల్లో జగన్ పరిపాలన తీరుపై వ్యతిరేకత పెరగటానికి కారణం అవుతోంది అని చెపుతున్నారు. అంతిమంగా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ పరిణామాలు అన్ని చూసి జగన్, చంద్రబాబుల మధ్య పోలిక రావటం సహజం. విద్యావంతులు ఎక్కువ మంది చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా కూడా...జగన్ తో పోలిస్తే ఎంతో కొంత ఆయనే బెటర్ అనే పరిస్థితి తీసుకువచ్చారని..ఇది వైసీపీ కి నష్టం చేసే అంశమే అని అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.