బిఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి

బిఆర్ఎస్ ఉక్కరిబిక్కిరి అవుతోంది. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై ప్రభుత్వం నియమించిన పీసి ఘోష్ కమిషన్ ఇటీవల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు నోటీసు లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ ఐదున తమ ముందు హాజరు కావాలని కమిషన్ అందులో కోరింది. మాజీ సీఎం కెసిఆర్ తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా నోటీసు లు అందాయి. ఇదే ఇప్పుడు బిఆర్ఎస్ లో ఒకింత కలకలం రేపుతుంటే ...గురువారం నాడు కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత కెసిఆర్ కు రాసినట్లు వెలుగులోకి వచ్చిన ఆరు పేజీల లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న తీరు కూడా సొంత పార్టీ లో తీవ్ర చర్చనీయాంశంగా గా మారింది. గత పదేళ్ల కాలంలో సామాజిక న్యాయం జరగలేదు అంటూ కవిత కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. ఒక రకంగా ఇది తండ్రి పాలనపై కూతురు చేసిన తీవ్ర వ్యాఖ్యలే. బిఆర్ఎస్ సారధ్య బాధ్యతలు మాజీ మంత్రి, ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించేందుకు రంగం సిద్ధం అవుతోంది అనే వార్తలు వస్తున్నట్లు తరుణంలో కవిత తన స్వరం మార్చారు.
మరో వైపు మాజీ మంత్రి, సీనియర్ నేత హరీష్ రావు కూడా గతానికి భిన్నంగా కేటీఆర్ కు కెసిఆర్ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తాను అంటూ చేసిన ప్రకటన కూడా పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కెసిఆర్ ఉన్నంత వరకు ఆయనే తమ నాయకుడు అని...అసలు నాయకత్వ సమస్య ఎందుకు వస్తుంది అని మాట్లాడిన హరీష్ రావు సడన్ గా తన స్టాండ్ మార్చటంతోనే మొత్తానికి పార్టీ లో ఏదో జరుగుతుంది అనే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో కవిత లేఖ వెలుగులోకి రావటం ఇప్పుడు మరింత వేడి రాజేసింది అనే చెప్పాలి. కవిత తన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
అందులో ప్రధానమైనవి ఇవే. ‘పార్టీ లీడర్స్‌కి యాక్సెస్ ఇవ్వడం లేదు. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్‌జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ మీద రెండు నిమిషాలే మాట్లాడారు. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడాల్సి ఉండాల్సింది. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారేమో అనే చర్చ మొదలైంది. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సింది. కాంగ్రెస్‌పై గ్రాస్‌రూట్స్‌లో నమ్మకం పోయింది. బీజేపీ ఆల్టర్‌నేటివ్ అనే ఆలోచనను మన కేడర్ చెబుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా.. బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. కెసిఆర్ యాక్సెస్ దొరకడం లేదని, సెలెక్టివ్ యాక్సెస్ అని జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారు. అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండి. వరంగల్ సభలో ఉద్యమనేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేది. పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్‌కు నచ్చలేదు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నవారికి.. నేరుగా పార్టీ ఆఫీసు నుంచే బీ ఫామ్స్ ఇవ్వాలి. వరంగల్ సభలో వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం అంశాన్ని విస్మరించారు. వరంగల్ సభ సభ సక్సెస్ అయినా కూడా వీటిపై కూడా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది’ అని కవిత తన లేఖలో ప్రస్తావించారు. కవిత అమెరికా లో ఉన్న తరుణంలో ఈ లేఖ ఇప్పుడు వెలుగులోకి రావటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ సభలో వేదిక మీద పార్టీ అధినేత కెసిఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే పెట్టి..హరీష్ రావు, కవితలను విస్మరించారు. ఇదే అప్పటి నుంచి పార్టీ లో కూడా హాట్ టాపిక్ మారిన సంగతి తెల్సిందే. అయితే కొంత మంది నాయకులు మాత్రం కవిత కు ఇప్పుడే ఈ విషయాలు అన్ని ఎందుకు గురుతుకు వస్తున్నాయి అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే కెసిఆర్ కనీసం మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అనే విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే ల సంగతి అయితే సరే సరి.



