ఒక్క చంద్రబాబు..పది యూనివర్సిటీల పెట్టు
ఆర్థిక మంత్రి వ్యాఖ్యలతో ఐఏఎస్ లు షాక్
తొలిసారి మంత్రి పదవి ఇచ్చిన టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి పయ్యావుల కేశవ్ కు కృతజ్ఞత ఉండటం తప్పేమి కాదు. అందునా అత్యంత కీలకమైన ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాల శాఖ ఇచ్చినందున ఈ ఆనందం మరింత ఎక్కువ ఉండటం సహజమే. కానీ ఆయన బుధవారం నాడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఐఏఎస్ అధికారులను షాక్ కు గురి చేశాయని చెప్పాలి. పయ్యావుల కేశవ్ భజన చేయాలనుకుంటే ఆయన ఇష్టం కానీ...ఆ భజన మరింత శృతిమించింది అని ఒక సీనియర్ ఐఏఎస్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ నిర్ణయం అయినా నియమ, నిబంధనలకు లోబడి పని చేయాలని అధికారులకు చెప్పాలి. కానీ పయ్యావుల కేశవ్ మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి చెపితే అది గుడ్డిగా చేయాలని ఆయన బహిరంగంగానే చెప్పారు. అదే సమయంలో పయ్యావుల కేశవ్ చంద్రబాబు పై కురిపించిన పొగడ్తలు చూసి అధికారులతో పాటు కొంత మంది మంత్రులు కూడా అవాక్కు అయ్యారు. అబ్బో ...ఈయన గారి టాలెంట్ మాములుగా లేదా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరించారు అని ఆరోపణలు ఎదురుకొంటున్న పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏంటో మీరు చదవండి. ‘ నేను ఈ స్థాయికి రావటానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు తో సుదీర్ఘకాలం పనిచేయటం. చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు. మీతో నా ఆలోచనలు పంచుకోవాలని అనుకుంటున్నా. హార్వర్డ్, స్టాన్ ఫర్డ్ , ఐఐఎం లు. ఐఐటి ల్లో చెప్పని విషయాలు కూడా మీరు చంద్రబాబు ను చూసి నేర్చుకోవచ్చు. మీరు కేవలం చంద్రబాబు అడుగుజాడల్లో నడవండి. ఆయన ఆలోచన విధానాన్ని అనుసరించండి. ఆయన్ను పరిశీలించండి..చూడండి.
ఇది మీకు అరుదైన అవకాశం. ఎంతో స్ఫూర్తి నింపే చంద్రబాబు దగ్గర పనిచేయటం మీకు దక్కిన అరుదైన అవకాశం. హైదరాబాద్ ను ఆయన గ్లోబల్ సిటీ గా మార్చారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ను కూడా గ్లోబల్ ఎకానమీ లో కీలక రాష్ట్రంగా మార్చే పనిలో ఉన్నారు. మీరు గుడ్డిగా ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలు . ఆయన ఆలోచనలను..ఆదేశాలను కళ్ళు మూసుకుని అమలు చేద్దాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళదాం. మీరు పది యూనివర్సిటీల్లో నేర్చుకోలేనిది ఒక్క చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోగలరు. ఇది జీవితంలో ఎదగటానికి ఒక అవకాశం. ప్రజల కోసం కాదు..మీ కోసం..ప్రజల కోసం, సమాజం కోసం. చంద్రబాబు ఎంతో స్ఫూర్తి నింపే నాయకుడి దగ్గర పని చేసే అవకాశం రావటం మీకు గొప్ప అవకాశం.’. అంటూ పేర్కొన్నారు.