తెర వెనక డీల్సే కారణమా?

వైసీపీ హయాంలో వైజాగ్ కేంద్రంగా మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భారీ ల్యాండ్ స్కాం కు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మీడియా లో కూడా పలు ఆధారాలతో సహా వార్తలు వచ్చాయి. అంతే కాదు జనసేన కు చెందిన వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియా సాక్షిగా జవహర్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. అది కూడా ఆయన సిఎస్ గా ఉన్న సమయంలోనే. మూర్తి యాదవ్ ఈ స్కాం పై ఆరోపణలు చేసినప్పుడు జవహర్ రెడ్డి లీగల్ నోటీసు లు ఇస్తాను అని...కఠిన చర్యలు తీసుకుంటాను అని ప్రకటనలు అయితే చేశారు కానీ చేసింది ఏమి లేదు. దీంతో జవహర్ రెడ్డి భయపడి వెనక్కిపోయినట్లు అయింది అన్న చర్చ వైసీపీ హయాంలోనే సాగింది. ఇది అంతా గతం. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ లో జరిగిన ఈ భారీ భూ కుంభకోణంపై కఠిన చర్యలు తీసుకుంటుంది అని...దీనిపై సిట్ వేసి మరీ విచారణ జరిపిస్తుంది అని టీడీపీ నాయకులు అప్పటిలో ప్రకటించారు. కానీ సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటినా కూడా ఇప్పటి వరకు అసలు సీనియర్ ఐఏఎస్, మాజీ సిఎస్ జవహర్ రెడ్డి భూ బాగోతం వైపు కూటమి సర్కారు కన్నెత్తి చూడలేదు.
అసలు జవహర్ రెడ్డి వైజాగ్ లో ఏమీ చేయలేదు అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు కూటమి నేతలు. తాము అసలు భూ దందాలు...అక్రమాలు ఏ మాత్రం సహించేది లేదు అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ...ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయంలో నోరు మెదపటం లేదు. వైజాగ్ బినామీ ల్యాండ్ స్కాం విషయంలో చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కు కూడా ఎంతో బాధ్యత ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇంతటి కీలక విషయాన్ని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ బహిర్గతం చేయటమే కాకుండా...అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి నుంచి ఆయన సవాళ్లు కూడా ఎదుర్కొన్నాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయంపై ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎక్కడా మాట్లాడలేదు. దీని అంతటికి ప్రధాన కారణం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ వ్యవహారంలో సెటిల్ మెంట్ చేసుకోవటమే ప్రధాన కారణం అన్న చర్చ టీడీపీ, జనసేన నేతల్లో కూడా సాగుతోంది. లేకుంటే ఒక ఐఏఎస్ అధికారి వేల కోట్ల రూపాయల భూములను బినామీల పేరుతో చేజిక్కించుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు మౌనంగా చూస్తూ ఊరుకుంటారా అన్న చర్చ కూడా రాజకీయ, అధికార వర్గాల్లో ఉంది.
సిఎస్ గా పని చేసిన వ్యక్తి ఏకంగా బినామీలతో వందల ఎకరాలు...అది కూడా అసైన్ మెంట్ భూములు దక్కించుకున్నారు అని ఇంత బహిరంగంగా ఆరోపణలు వచ్చిన దాఖలాలు అయితే గతంలో ఎన్నడూ లేవు అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో జవహర్ రెడ్డి తన బినామీలతో విశాఖపట్నం జిల్లాలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే వందల ఎకరాలను దక్కించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అసైన్ మెంట్ భూములు అమ్ముకోవటానికి వీలుగా లబ్దిదారులకు వీటిపై పూర్తి హక్కులు కలిపించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విషయం జవహర్ రెడ్డి కి అందరికంటే ముందే తెలిసింది అని.... ఇదే అదనువుగా విశాఖపట్నం జిల్లాలోని భూములపై కన్నేసి కథ నడిపించినట్లు జవహర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జవహర్ రెడ్డి బినామీలు ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో భారీ డీల్స్ చేసినట్లు చెపుతున్నారు. ఉమేష్, త్రిలోక్ అనే పేర్లు ఉన్న వాళ్ళు అప్పటి సిఎస్ తరపున వైజాగ్ లో ఈ లావాదేవీలు జరిపినట్లు అక్కడ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం 800 నుంచి 1000 ఎకరాల వరకు ఉంటుంది అని చెపుతున్నారు. అయినా సరే విచారణ లేదు...చర్యలు లేవు అంటే దీని వెనక ఎంత పెద్ద కథ నడిచిందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక జవహర్ రెడ్డి ల్యాండ్స్ స్కాం విషయంలోనే కాకుండా గత హయాంలో జరిగిన పలు స్కాం లే అస్త్రాలుగా ఒక కీలక నేత సారథ్యంలో కిమ్ అండ్ టీం సెటిల్ మెంట్స్ చేయటంతో పాటు ఎవరి వాటాలు వాళ్లకు పంపుతున్నట్లు చెపుతున్నారు. అందుకే అందరూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.



