దసరాకు ఆర్టీసీ బస్సులు నడపకపోవటం ప్రభుత్వ వైఫల్యమే
ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించకపోవటాన్ని జనసేన తప్పుపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు రావాలనుకొనే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కనీసం దసరా నాటికైనా బస్సులు తిరిగితే సొంత ఊళ్ళకు రావాలనుకొన్నవారికి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరాశ కలిగించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే ప్రత్యేక దృష్టిపెట్టి చర్చించకపోతే సంక్రాంతికి కూడా సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సానుకూలంగా సమస్యను సత్వరమే పరిష్కరించాలన్నారు. తమకు కావల్సినవారికి అత్యవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించే ఏపీ ప్రభుత్వం- పేదల కోసం బస్సులు నడపలేకపోతోంది.
రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగకపోవడం వల్ల ఎదురవుతున్న ఇక్కట్లను పలువురు పార్టీ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. లాక్ డౌన్ కి ముందు రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 1281 బస్సులు నడిచేవని, ఇప్పుడు ఒక్క బస్సు కూడా తిరగటం లేదన్నారు. అదే విధంగా రైల్వే సేవలూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమయంలోనే ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంచితే ప్రయోజనకరంగా ఉండేది. కిలోమీటర్ల లెక్కలు తేలలేదు కాబట్టి బస్సులు నడపలేము అనేది సంతృప్తికరమైన సమాధానం కాదని ప్రభుత్వం గుర్తించాలన్నారు.