Telugu Gateway
Andhra Pradesh

ప్రైవేట్ సంస్థలకు లాభార్జనే ఏకైక ధ్యేయం..మరి జె పీ పవర్ అందుకు మినహాయింపా?

ప్రైవేట్ సంస్థలకు లాభార్జనే ఏకైక ధ్యేయం..మరి జె పీ పవర్ అందుకు మినహాయింపా?
X

ఏపీఎండీసీని కాదని ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు

దేశంలో ఉత్తమ విధానం అంటూ ప్రకటనలు

ఇప్పుడు తూచ్ అంటూ...ప్రైవేట్ వైపు పరుగులు

'ప్రైవేట్‌ రంగ సంస్థలు లాభార్జనే ఏకైక ధ్యేయంగా నడుపుతాయి'. ఇది రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఈ మాటలు అన్నారు. ఇందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. కానీ ఇదే వైసీపీ సర్కారు ఏపీలో ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ పరిధిలో ఉన్న ఇసుక సరఫరాను ప్రైవేట్ సంస్థ జె పీ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టింది. మరి విజయసాయిరెడ్డి రాజ్యసభలో చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే ఎపీఎండీసీ ద్వారా సరఫరా వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా?. లేక ప్రైవేట్ సంస్థ జె పీ పవర్ వెంచర్స్ ద్వారా మేలు జరుగుతుందా?. మరి విజయసాయిరెడ్డి మాటలు నిజమా?. లేక ఇప్పుడే ప్రజలకు ఎంతో మేలు జురుగుతుంది అని పంచాయతీరాజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేదీ మాటల్లో నిజం ఉందని నమ్మాలా?. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక అసలు దేశంలో ఎక్కడా లేని ఇసుక విధానం తెస్తామని..అది తెచ్చాక అసలు సమస్యలు ఉండవని ఏకంగా కొన్ని నెలల పాటు రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీనిపై చివరకు సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అత్యుత్తమ విధానం..సాఫ్ట్ వేర్ రూపకల్పన చేశారు..ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే చాలు..ఇంటి ముందు వాలిపోతుంది అంటూ హోరెత్తించారు. అంతే కాదు..ఇసుక సరఫరా వాహనాలకు జీపీఎస్ పెడుతున్నాం..ఎక్కడ నుండి ఎక్కడకు ఇసుక రవాణా అవుతుందో కూడా తెలిసిపోతుంది అంటూ ప్రకటనలు చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ సరఫరా చేసిన సమయంలోనే ధర విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవ ధరకు..ప్రజలు చెల్లించే ధరలకు చాలా వ్యత్యాసం ఉండటం ఒకెత్తు అయితే..ఇసుక అందుబాటు కూడా ఓ పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థ నడిపిన సమయంలోనే ఇసుక ధరల నియంత్రణ విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ సంస్థకు అప్పగించి..అంతా సవ్యంగా సాగిపోతుంది...ధరల్లో కూడా తేడాలు ఏమీ ఉండదు అంటే జరిగే పనేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు..ఆర్ధికంగా దివాళా తీసిన పరిస్థితిలో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ రాష్ట్రమంతటా ఇసుక సరఫరా చేయగలదా అన్న అంశంపై ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేనలు సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా..వైసీపీ ఉన్నా అందరికీ 'ఇసుకే కాసులు కురిపించే ఖనిజంగా' మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Next Story
Share it