Telugu Gateway
Andhra Pradesh

హాట్ టాపిక్ గా కందుల దుర్గేష్ తీరు

హాట్ టాపిక్ గా కందుల దుర్గేష్ తీరు
X

హీరోల దగ్గరకు ప్రభుత్వం వెళుతుందా...ప్రభుత్వం దగ్గరికి హీరోలు రావాలా?. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలు ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టరు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వాళ్ళ అవసరాలు తీర్చటం కూడా తప్పేమి కాదు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వంలో జనసేన కు మూడు మంత్రి పదవులు వచ్చిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు మంత్రి పదవులు దక్కాయి. కందుల దుర్గేష్ కు పర్యాటక శాఖ తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా దక్కింది. మంత్రి హోదా లో కందుల దుర్గేష్ చిరంజీవి హీరో గా నటిస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ కు వెళ్లారు. ఈ విషయాన్ని చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ మంతితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ‘మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు! తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను!’ అంటూ స్పందించారు.

గత ఎన్నికలకు ముందు జనసేన కు మద్దతు విషయంలో చిరంజీవి ఎన్ని సార్లు మాటలు మార్చారో లెక్కే లేదు. పైగా చిరంజీవి ఎన్నికల ముందు జనసేనకు మద్దతు విషయంలో కూడా సెలెక్టెడ్ గా వీడియో లు విడుదల చేశారు తప్ప...ఇప్పుడు మంత్రిగా ఆయన దగ్గరకు వెళ్లిన కందుల దుర్గేష్ గెలుపునకు కూడా చిరంజీవి పిలుపు ఇవ్వలేదు. గత ఎన్నికల ముందు చిరంజీవి నేరుగా పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి గా ఉన్న సీఎం రమేష్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ల కోసమే బహిరంగంగా వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వైసీపీ కి, జగన్ కు భయపడే చిరంజీవి అంధ ప్రదేశ్ రాజకీయాల విషయంలో తాను జోక్యం చేసుకోను అని...పూర్తిగా తన వ్యాపకం సినిమాలు తప్ప మరొకటి లేదు అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి గెలిచిన తర్వాత ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేక అతిధిగా పిలిచారు. ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంటడంతో అందులో పెద్దగా ఆక్షేపించాల్సిన విషయం కూడా ఏమి లేదు. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి సినిమా సెట్స్ వెళ్లి చిరంజీవిని కలిసి అక్కడే సినిమా పరిశ్రమ అభివృద్ధికి ..సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను అని చెప్పటం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది.

Next Story
Share it