ఆ పదకొండు కోట్ల నగదు విషయంలో ట్విస్ట్!

ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి శంషాబాద్ సమీపం లోని ఫార్మ్ హౌస్ లో దొరికిన పదకొండు కోట్ల రూపాయల విషయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ స్కాం లో ఏ 40 గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారం ఆధారంగా సిట్ అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కాం కింగ్ పిన్ గా చెపుతున్న రాజ్ కేసిరెడ్డి తో పాటు చాణక్య ఆదేశాల మేరకు 2024 జూన్ లో ఈ మొత్తాన్ని అక్కడ అట్టపెట్టెల్లో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఏపీ లో జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలు అన్ని నగదు రూపంలో జరగటం..ఈ స్కాం కు సంబంధించిన నగదు పదకొండు కోట్ల రూపాయలు దొరకటం ఈ కేసు లో కీలకంగా మారింది అనే చెప్పాలి.
ఈ కేసు కు ఇది ఎంతో కీలకం కూడా అవుతుంది. ఈ తరుణంలో లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి జైలు లో ఉన్న రాజ్ కేసిరెడ్డి దీనిపై ఏసీబీ కోర్ట్ లో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ సీజ్ చేసినట్లు చెపుతున్న పదకొండు కోట్ల రూపాయలతో తనకు సంబంధం లేదు అని తెలిపారు. తనకు బెయిల్ రాకుండా ఉండేందుకే ఇలాంటి ప్రచారాలు తెరమీదకు తెస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఈ ఫార్మ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డి ది అని..ఆయనకు ఇంజనీరింగ్ కాలేజీ లతో పాటు హాస్పిటల్స్, ఇతర వ్యాపారాలు ఉన్నాయి అని తెలిపారు.
విజయేందర్‌రెడ్డి కోట్ల రూపాయల టర్నోవర్‌తో లావాదేవీలు చేస్తారు.. విజయేందర్‌రెడ్డికి చెందిన ఆరెట్ హాస్పిటల్‌లో తన భార్య చిన్న వాటాదారు మాత్రమే అని పేర్కొన్నారు. అంతకు మించి విజయేందర్‌రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదు అని తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది అని ఏపీ లిక్కర్ స్కాములో ఏ 40 గా ఉన్న వరుణ్ పురుషోత్తం కు ఎక్కడో శంషాబాద్ దగ్గర ఉన్న ఒక ఫార్మ్ హౌస్ లోని అట్ట పెట్టెల్లో ఏకంగా పదకొండు కోట్ల రూపాయల నగదు ఉంది అని తెలుస్తుంది?. ఆయన ఈ విషయం ఈ సిట్ అధికారులకు ఎలా చెప్పగలిగాడు అన్నదే ఇప్పుడు కీలకం. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్ ఎంత పకడ్బందీగా నడిపిస్తుంది అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం.



