ఏపీలో పీఆర్సీ రగడ..రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
సర్కారు ఇచ్చిన పీఆర్ సీతోనే ఏదో సర్దుకుపోదామని సిద్ధపడిన ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. హెచ్ఆర్ ఏతో పాటు పలు అంశాల్లో కోతలు విధిస్తూ సర్కారు జారీ చేసిన జీవోలతో అందరూ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇంత కాలం ప్రభుత్వానికి ఒకింత అనుకూలంగా ఉంటూ వచ్చిన సచివాలయం ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి కూడా సర్కారు తీరును తప్పుపట్టారు. మిగిలిన సంఘాలు చేపట్టే కార్యాచరణకూ మద్దతు ప్రకటించారు. దీంతో ఉద్యోగుల విషయంలో సర్కారు వైఖరిలో తేడా ఉందనే సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు గురువారం నాడు కలెక్టరేట్ల ముట్టడి ప్రకటించాయి.
అయితే పోలీసులు ఉదయం నుంచే ఉపాధ్యాయ సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కలెక్టరేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు అసలు కొత్త పీఆర్సీ వద్దే వద్దని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే సమ్మెకు వెళ్ళటానికి కూడా వెనకాడబోమని ప్రకటించారు. ఈ నెల21న సీఎస్ కు నోటీసు ఇస్తామని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు నిరసనలకు దిగారు. బుధవారం నాడు అన్ని జిల్లాల్లోనూ నిరసనలు చేపట్టి పీఆర్సీ జీవోలను కాల్చివేశారు.