డేటా సెంటర్ల పేరుతో ఏపీ సర్కారు నిర్వాకం

పర్యావరణ సమస్యలు అధికం
భారీగా నీరు...విద్యుత్ వినియోగం
లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్న అధికారులు
ఏదైనా పరిశ్రమ రాష్ట్రానికి వస్తే ...దాని వల్ల రాష్ట్ర ప్రజలకు..యువతకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగేలా ఉండాలి. కానీ ఆంధ్ర ప్రదేశ్ సర్కారు తీరు మాత్రం పూర్తి రివర్స్ లో ఉంటోంది. రాష్ట్రానికి ప్రయోజనం సంగతి ఏమో కానీ...బడా బడా కార్పొరేట్ సంస్థలకు మాత్రం వేలకోట్ల రూపాయల ప్రయోజనాలు కల్పిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సర్కారు ఈ పెట్టుబడుల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందకపోగా...భారీ ఎత్తున ఆదాయం కోల్పోవలసి వస్తోంది. తాము రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించటం కోసమే పరిశ్రమలకు భారీ ఎత్తున రాయితీలు...డిస్కౌంట్ రేట్లతో భూములు ఇస్తున్నామని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పదే పదే చెపుతున్నారు. కానీ అందులో ఏ మాత్రం నిజం ఉన్నట్లు కనిపించటం లేదు. ముఖ్యంగా డేటా సెంటర్ ప్రాజెక్ట్ ల విషయంలో రాష్ట్రం భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే గూగుల్, అదానీ డేటా సెంటర్ కు భారీ రాయితీలు ప్రకటించిన ఏపీ సర్కారు ఇప్పుడు దిగ్గజ కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ కు కూడా అంతే స్థాయిలో వరాలు ప్రకటించింది. ఈ రాయితీలు..ప్రోత్సహకాలు మొత్తం దగ్గర దగ్గర 20000 వేల కోట్ల రూపాయల వరకు చేరనున్నాయి.
కానీ ఈ సంస్థ కల్పించే ఉద్యోగాలు కేవలం వెయ్యి అంటే వెయ్యి మాత్రమే. అది కూడా గ్యారంటీ లేదు. కేవలం అవకాశం ఉంది అని మాత్రమే సర్కారు జారీ చేసిన జీలో పేర్కొన్నారు. పోనీ కంపెనీ చెప్పినట్లు వెయ్యి ఉద్యోగాలు ఇచ్చినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కల్పించే ఒక్కో ఉద్యోగానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 20 కోట్ల రూపాయల మేర రాయితీలు..ప్రోత్సహకాలు ఇచ్చినట్లు అవుతుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రిలయన్స్ లాంటి సంస్థకు డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 20000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చే బదులు... ఎంపిక చేసిన నిరుద్యోగులకు కోటి రూపాయల లెక్కన ఆర్థిక సాయం అందించినా కూడా అది రాష్ట్రానికి...రాష్ట్ర యువతకు మేలు చేసినట్లు అవుతుంది అని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అడ్డగోలుగా డేటా సెంటర్లకు రాయితీలు ఇవ్వటం ఒక సమస్య అయితే ...ఈ ప్రాజెక్ట్ ల వల్ల భవిష్యత్ లో పర్యావరణపరంగా ఎన్నో సమస్యలు వస్తాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతే కాదు ఈ ప్రాజెక్ట్ లు పెద్ద ఎత్తున విద్యుత్, నీటిని కూడా వినియోగిస్తాయి. గూగుల్-అదానీ డేటా సెంటర్ విషయంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నది ఈ కంపెనీలు అయితే ...వీటి రాకవల్ల ఆంధ్ర ప్రదేశ్ కు ఏదో పెద్ద మేలు జరగబోతున్నట్లు చంద్రబాబు సర్కారు కలరింగ్ ఇస్తోంది. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని ఐఏఎస్ అధికారులే చెపుతున్నారు.



