చెన్నయ్ లో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారు

Update: 2020-10-30 07:54 GMT

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సర్కారు తీరుపై, మంత్రుల వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చెన్నయ్ లో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వరద కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అప్పు కోసం కావాలంటే జగన్ ప్యాలెస్ లు తనఖా పెట్టొచ్చని వ్యాఖ్యానించారు. కొంత మంది మంత్రులు నారా లోకేష్ ఏ హోదాతో తిరుగుతున్నాడని ప్రశ్నిస్తున్నారని..తనకు హోదా, అధికారం లేకపోయినా మానవత్వం ఉందని అన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం రైతులను గాలికొదిలేసిందని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండేందుకే తాను ఐదు జిల్లాల్లో పర్యటించారనన్నారు.

రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పొలాల్లో తిరుగుతుంటే తనను ఓ మంత్రి ఎద్దు అన్నారని, మరి గాల్లో తిరిగే వాళ్లను దున్నపోతు అంటారా? అని ఆ మంత్రిని ప్రశ్నిస్తున్నానన్నారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమన్నారు. 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు. తాము మీటర్లను అంగీకరించబోమని, వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే అని ప్రశ్నించారు.

Tags:    

Similar News