దుబ్బాకలో నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి సుజాత

Update: 2020-10-14 13:10 GMT

దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీలు ఈ సీటులో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బిజెపిలో దుబ్బాక సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టాయనే చెప్పాలి. భవిష్యత్ తెలంగాణ రాజకీయాలకు దుబ్బాక ఫలితం దశ, దిశనే నిర్ణయించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అందుకే పార్టీలు అన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ఉన్న సోలిపేట సుజాత బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టిక్కెట్‌ కేటాయించడం తెలిసిందే.

ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ ప్రభాకర్‌తో కలిసి బుధవారం రిటర్నింగ్ అధికారికి సోలిపేట సుజాత తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా... 17న పరిశీలన, 19వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు.

Tags:    

Similar News