'ఆయనో 'విపత్తు' వంటి వారు. మనం ఆయన మాటలు విని ఉంటే ఇప్పుడు అమెరికాలో కరోనా మరణాలు ఐదు లక్షలు దాటి ఉండేవి. కానీ ప్రస్తుతం 2.20 లక్షలు ఉన్నాయి' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ అంటోని పౌచీపై ట్రంప్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంటోనీ పౌచీ అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు అన్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణ విషయంలో ఆయన మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తీరును తప్పుపడుతున్నారు. మాస్క్ లు ధరిస్తూ ప్రజలు గుమికూడకుండా ఉండాలని పౌచీ సూచిస్తుంటే..ట్రంప్ అందుకు భిన్నంగా మాస్క్ లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని..తాను కూడా పెట్టుకోనని వ్యాఖ్యనించి ట్రంప్ కలకలం రేపారు.
పౌచీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని వ్యాఖ్యనించారు. ఆయన చెప్పినట్లే కొద్ది రోజుల క్రితం ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అమెరికాలోని ట్రంప్ మద్దతు దారులు అంతా అంటోనీ పౌచీ బిల్స్ గేట్స్ తో కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రకరకాల కుట్ర సిద్ధాంతాలను వీరు తెరపైకి తెస్తున్నారు. పౌచీ మాటలు వినివినీ దేశ ప్రజలు అంతా విసిగిపోయారని ట్రంప్ మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకునే తాను పౌచీని బయటకు పంపలేదని వ్యాఖ్యానించారు.