తెలంగాణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మంగళవారం నాడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రేవంత్ ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేయగా..అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గోడవ మరింత పెరగడంతో పోలీసులు రెండు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య జరుగుతున్న డ్రగ్స్ వార్‌కు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్, రేవంత్‌పై పరువు నష్టం కేసు వేశారు. రేవంత్ వ్యాఖ్యలు నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ ఇంటి ముట్టడికి పిలుపిచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ ఇంటికి చేరుకున్నారు.
ఈ తరుణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో స్వల్ప లాఠీ చార్జ్ చేసి.. ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరో వైపు టీఆర్ఎస్ శ్రేణులు అమరవీరుల స్థూపం వద్ద పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి స్థూపాన్ని మలినం చేశారని ఆరోపిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. సోమవారం నాడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలసి వైట్ చాలెంజ్ పేరుతో కెటీఆర్ ను ఆహ్వానిస్తూ అక్కడ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.