తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ లో పాల్గొనాల్సిన కెసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోడీతో విందులో పాల్గొన్నారని విమర్శించారు. ఇదే నెలలో ఓ సారి ప్రధాని, హోం మంత్రి, కేంద్ర మంత్రులందరిని కలసిన ఆయన మళ్ళీ ఢిల్లీలో బంద్ రోజున కూడా ఎందుకు ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల సమస్య కాదని..రైతులు కష్టాల్లో ఉన్నారన్నారు. మోడీ, కెసీఆర్ పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
రైతుల ఉద్యమానికి తొలుత మద్దతు ఇచ్చిన కెసీఆర్ ఢిల్లీలో మోడీని కలిసొచ్చిన తర్వాత మాత్రం దూరంగా ఉంటున్నారన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ప్రధాని మోడీ కార్పొరేట్లు అయిన అంబానీ, అదానీలకు తాకట్టుపెట్టారని ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు రైతులకు మరణశాసనాలే అన్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. భారత్ బంద్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఉప్పల్ డిపో ఎదురుగా ఇతర పార్టీ నేతలతో కలసి నిరసనలో పాల్గొన్నారు.