తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ సెగలు

Update: 2020-12-12 09:33 GMT

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు అధిష్టానం రెడీ కావటంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో కొంత మంది తమకు రాకపోయినా పర్వాలేదు..తాము వ్యతిరేకించే వ్యక్తులకు మాత్రం పదవి దక్కకుండా చూసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే పార్టీ నేతలు అందరూ గ్రూపులు గ్రూపులుగా సమావేశాలు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పీసీసీ పదవి ఇవ్వాలనే వాదనను తెరపైకి తెచ్చారు. మరికొంత మంది అయితే తమకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ను విజయతీరాలకు తీసుకెళతామని ప్రకటిస్తున్నారు. విచిత్రంగా పీసీసీ రేసులో ఉన్న ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా మాట్లాడకుండా మౌనం వహించటం కూడా చర్చనీయాంశంగా మారింది. మరో వైపు రాష్ట్ర తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ జిల్లాల నేతల దగ్గర నుంచి మొదలుపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సహజంగా కాంగ్రెస్ లో అధిష్టానం చెప్పిన వారికే పదవులు కానీ ఇలాంటి అభిప్రాయ సేకరణలూ గట్రా ఉండవు. కానీ తొలిసారి అందుకు భిన్నంగా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

అయితే అధిష్టానం ఆలోచన ఎలా ఉందో తెలుసుకున్న నేతలు కొత్త కొత్త వాదనలు తెరపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఎవరికి వారు సమావేశం అయి పీసీసీ పదవి విషయంలో ఎలా ముందుకెళ్ళాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. పైకి చెప్పకపోయినా అందరి అజెండా అధిష్టానం మనసులో ఉన్న వ్యక్తికి పదవి దక్కకుండా అడ్డుపడాలన్నదే వారి ఆలోచనగా ఉందని చెబుతున్నారు. మరి మాణికం ఠాకూర్ వారికి ఎలా సర్దిచెబుతారు..పీసీసీ అధ్యక్ష ప్రకటన తర్వాత ఎంత మంది రాజీనామా చేయటానికి రెడీ అవుతారు అన్న అంశంపై కూడా పార్టీలో చర్చ సాగుతోంది. కొత్తగా ఎవరు రాజీనామా చేసినా కాంగ్రెస్ కు ఇప్పుడు ఉన్న దాంట్లో పెద్దగా పోయేదేమీ ఉండదని ఓ నేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News