ప్రస్తుతం అందరి చూపు అమెరికా ఎన్నికల వైపే. మంగళవారం నాడు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఒపీనియన్ పోల్స్ లో ఎక్కువ మంది స్పష్టమైన తేడాతో డెమాక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బైడెన్ ముందు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మరికొంత మంది వాదన అందుకు భిన్నంగా ఉంది. పోటీ హోరాహోరీగా ఉందని, ఇద్దరి మధ్య తేడా కూడా పెద్దగా లేదన్నది వీరి లెక్క. అయినా వీరు కూడా జో బైడెన్ ట్రంప్ కంటే ముందు వరసలో ఉన్న విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు. ఈ సారి అమెరికా అద్యక్ష ఎన్నికల్లో కరోనానే కీలక అంశంగా మారింది.
ఎన్నికల ముందు అనూహ్యంగా కేసులు పెరగటం కూడా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు ప్రతికూలంగా మారిందనే అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తన బ్యాగులు సర్దుకుని ఇంటికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నం అయిందని అన్నారు. ట్రంప్ కు సంబంధించి బాధ్యతారహిత్యాలు, వైఫ్యలాలు, అసూయ, ద్వేషాలను చూస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చాలా పని చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికైతే కోవిడ్ 19ను ఎదుర్కొనుందుకు కార్యాచరణ ప్రణాళికనే ముందు ప్రకటిస్తానని తెలిపారు.