జనసేనతో తమకు పొత్తులేదని తాము సొంతంగానే పోటీచేస్తున్నామని బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తొలుత జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉంటున్నామని ప్రకటించిన జనసేన తర్వాత బిజెపికి మద్దతుగా పోటీ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే నిజామాద్ ఎంపీ అరవింద్ శుక్రవారం నాడు ఓ ఛానల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమకు ఎవరితో పొత్తులేదని..సొంతంగానే పోటీచేస్తున్నామని ప్రకటించారు. దీనిపై జనసేన స్పందించింది. ధర్మపురి అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకులు కోరిన మీదటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన పార్టీ తప్పుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిందని తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబు కాదన్నారు.