దేశ ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఫ్రంట్ లు..టెంట్లు కాదు

Update: 2022-04-27 15:52 GMT

జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించి తెలంగాణ సీఎం కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం నాడు హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్లీన‌రీ స‌మావేశంలో పార్టీ నేత‌లు అంద‌రూ జాతీయ రాజ‌కీయాల్లో కెసీఆర్ కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు. ఈ అంశంపై మాట్లాడిన కెసీఆర్ అవసరమైన సమయంలో జాతీయ రాజకీయాల పై ముందుకు వెళదామ‌న్నారు. ప్రధాని కుర్చీ అనేది మన లక్ష్యం కాదన్నారు. ఇప్పుడు దేశ ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఫ్రంట్లు..టెంట్లు కాద‌న్నారు. వివిధ రంగాల‌కు చెందిన నిఫుణుల‌తో ఈ అంశంపై త్వ‌ర‌లో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న‌ట్లు తెలిపారు. చైనా విధానాల‌ కంటే ఇండియా పాలసీ బెటర్ గా ఉంటే ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేది త‌న ప్ర‌శ్న అన్నారు. కలలను నిజం చేసుకోవచ్చు అని అందుకు ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే అని వ్యాఖ్యానించారు. మనసు పెట్టి చేస్తే అమెరికా ను మించిన ఆర్థికశక్తిగా ఇండియా అవుతుందని తెలిపారు. దేశానికి కొత్త ఎజెండాను తయారు చేయడానికి తాను ఒక సైనికుడిని అవుతాన‌ని తెలిపారు. జాతీయ పార్టీ కోసం ఫండ్ కావాలంటే టీఆర్ఎస్ కు ఉన్న 60లక్షల సభ్యత్వమే త‌మ బ‌లం అని..60లక్షల సభ్యత్వం ఉన్న మాకు తలా ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినా 600 కోట్లు అవుతుందని తెలిపారు.

ఎవరు అవాకులు చెవాకులు మాట్లాడినా పట్టించుకోవాల్సిన ప‌నిలేద‌ని..తిరిగి తామే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నామ‌ని తెలిపారు. సర్వేల్లో 90స్థానాలకు పైగా టీఆరెస్ గెలుస్తుందని ఫలితాలు వచ్చాయ‌న్నారు. ప్లీన‌రీ చివ‌రిలో మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ పైనా కెసీఆర్ మండిప‌డ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంధనంపై పన్నులు తగ్గించాలంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కేంద్రం లేని సెస్సులు ఎందుకు పెంచుతోందని ప్రశ్నించిన కేసీఆర్‌ ఏ నోటితో రాష్ట్రాలను తగ్గించాలని అడుగుతారని నిల‌దీశారు. ఇదేం పద్దతి? ప్రధాని మాట్లాడే మాటలేనా అని ప్ర‌శ్నించారు. కరోనా కాన్ఫరెన్స్‌ పెట్టి రాష్ట్రాలు పెట్రోల్‌పై పన్నులు తగ్గించమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ డ్రామా కాన్ఫరెన్స్‌ పెట్టారని విమర్శించారు.

తామెప్పుడు పెట్రోల్‌ ధరలు పెంచామని ప్రశ్నించిన కేసీఆర్‌.. తెలంగాణ వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌పై ట్యాక్స్‌ పెంచలేదని స్పష్టం చేశారు. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్ర పెద్దలేనని అన్నారు. 'ఆర్టీసీని అమ్మే రాష్ట్రాలకు వెయ్యి కోట్ల ప్రైజ్‌ మనీ అట?. ఎనిమిదేళ్లలో మోదీ ఏం అభివృద్ధి చేశారు. ఏ రంగం అభివృద్ధి జరిగింది. పన్నులు పెంచేది మీరు.. రాష్ట్రాలు తగ్గించాలా.. ఇదెక్కడి నీతి. మోదీ ఇక మీ ఆటలు కొనసాగవు. ప్రజాస్వామ్యం ఇంకా చచ్చిపోలేదు. పొద్దున లేస్తే మతం రాజకీయాలు చేస్తున్నారు. మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా? మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి మతాన్ని వాడతారా? రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నారు.' అని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News