కారణం ఏంటి?. అసలు ఢిల్లీ పర్యటన ఎందుకు?. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశం ఆదివారం నాడే అయిపోయింది. ముందు ప్రకటించినట్లుగానే కలవాల్సిన మంత్రులను కూడా సీఎం కెసీఆర్ కలిశారు. కానీ మళ్ళీ ఎందుకు సీఎం కెసీఆర్ ఢిల్లీలోనే ఆగారు.అసలు ఏమి జరుగుతోంది. ఒకే నెలలో రెండుసార్లు సీఎం కెసీఆర్ ఢిల్లీ పర్యటనే ఆసక్తికర చర్చకు తెరతీసింది. సహజంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభా నాయకుడు అయిన ముఖ్యమంత్రి విధిగా సమావేశాలకు హాజరవుతారు. అత్యవసరం అయితే తప్ప..బయటకు వెళ్ళారు. కానీ సీఎం కెసీఆర్ ఢిల్లీ హాజరవ్వాల్సిన సమావేశాలకు హాజరయ్యారు.కలవాల్సిన వాళ్ళను కలిశారు. కానీ అసెంబ్లీ సమావేశాలను కాదని కూడా ఢిల్లీలో ఉండాల్సిన అంత అత్యంత కీలకమైన అంశాలు ఏమీ ఉన్నాయి. ఇది రాజకీయాలకు సంబంధించిందా?. లేక రాష్ట్రానికి సంబంధించిందా? లేక వ్యక్తిగతమైనదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
వామపక్ష తీవ్రవాద అంశానికి సంబంధించి హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం కెసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రి హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కూడా కలుసుకున్నారు. అయినా సరే ఇంకా సీఎం కెసీఆర్ ఢిల్లీ టూర్ ముగియలేదు అంటే ఏదో జరుగుతోంది అన్న ప్రచారం సాగుతోంది. ఓ వైపు దేశంలోని కీలక పార్టీలు అన్నీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. తొలుత దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కెసీఆర్ తర్వాత మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ బంద్ కు సైతం అధికార టీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బిజెపి, టీఆర్ఎస్ ఒకటే అని..ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలంటూ విమర్శలు ఎక్కుపెడుతోంది. అయినా దీనిపై టీఆర్ఎస్ నాయకులు ఈ అంశంలో మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.