మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి..తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ విషయంలో తాను ఎలా ఉండబోతున్నది స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు నిజాయతీ, నిబద్ధత ఉందని..తనను చిన్నప్పటి నుంచి చూస్తున్న తాను ఈ విషయం చెబుతానన్నారు. భవిష్యత్ లో ప్రజలు పవన్ కళ్యాణ్ కు రాష్ట్రాన్ని ఏలే ఛాన్స్ ఇవ్వొచ్చని..ఆ రోజులు రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. పవన్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు అవసరం అన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తర్వాత తాను రాజకీయాల నుంచి పక్కకు వచ్చానన్నారు. చెరోవైపు ఉండటం సరికాదనే పక్కకు తప్పుకున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ తన తమ్ముడి అని..ఆయనకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్ లో జనసేనకు మద్దతు ఇస్తానేమో అని వ్యాఖ్యానించారు. పవన్ ఎటువైపు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్న రాజకీయ పార్టీ..గుర్తులు కూడా జనసేన పార్టీకి దగ్గరగా ఉండటంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..ఇందులో తన ప్రేమయం ఏమీలేదని..ఇది చేసిన వారెవరికీ ఏపీ రాజకీయాల గురించి కూడా తెలియవన్నారు.
సినిమాలో డైలాగులు కూడా ఒరిజినల్ సినిమాలో ఉన్నవే అని.వీటిని చూసి ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని వ్యాఖ్యానించారు. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో చిరంజీవి జనసేనకు మద్దతు ఇవ్వటం ఖాయంగా కన్పిస్తోంది. మరో కీలకమైన అంశం ఏమిటి అంటే చిరంజీవి తాజా ప్రకటనపై అధికార వైసీపీ ఎలా స్పందిస్తుంది అన్నది వేచిచూడాల్సిందే. పవన్ పై ఆ పార్టీ నేతలు నిత్యం ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి విషయంలో మాత్రం సాఫ్ట్ కార్నర్ గా ఉంటూ..పవన్ పై ఎటాక్ చేసే వైసీపీ నేతలు ఇప్పుడు ఇక చిరంజీవిని కూడా టార్గెట్ చేస్తారేమో . సరిగ్గా గాడ్ ఫాదర్ విడుదలకు ఒక్క రోజు ముందు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆయన సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో వేచిచూడడాల్సిందే. ఇటీవల వరకూ పవన్ ఫ్యాన్స్ లో కూడా ఒకింత గందరగోళం ఉండేది. చిరంజీవి పవన్ కు మద్దతు ఇస్తారా..ఇవ్వరా అనే అంశంలో. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో పలు అంశాలపై స్పష్టత వచ్చినట్లు అయింది.