కెసీఆర్ దీక్ష తెలంగాణ రైతుల కోసమా..పంజాబ్ రైతుల కోస‌మా?

Update: 2021-11-21 10:58 GMT

తెలంగాణ సీఎం కెసీఆర్ దీక్షకూ ..ప్ర‌ధాని మోడీ రైతు చ‌ట్టాల ర‌ద్దుకు ఏమైనా సంబంధం ఉందా అని తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. కెసీఆర్ దీక్ష రైతల కోసం కాద‌ని..మిల్ల‌ర్ల కోసం అంటూ విమ‌ర్శించారు. సంజ‌య్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా..? పంజాబ్ రైతుల కోసమా? అన్నది అర్థంకావ‌టంలేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్‌ తీసేయాలన్న ముఖ్యమంత్రి అక్కడే ధర్నా చేశారని విమర్శించారు. మిల్లర్లతో కలిసి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, రైతుల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రైతులకు రూ.3లక్షలు ఇస్తారట... మరి తెలంగాణలో చనిపోయిన రైతులకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ మూర్కత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. నీ అనాలోచిత నిర్ణయాల వల్ల చనిపోయిన తెలంగాణ రైతులకు పరిహారం ఇవ్వావా అని ప్రశ్నించారు. తెలంగాణ‌లో చనిపోయిన రైతులకు రూ. 25 లక్షలు ఇచ్చి ఆ తరువాత కేంద్రాన్ని అడగాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని బండి సంజయ్‌ విమర్శించారు. వారం రోజుల నుంచి ధాన్యం కొనమని చెబితే కొనలేదని దుయ్యబట్టారు. వానాకాలం పంట‌ కొంటవా? కొనవా అని మొత్తుకున్నట్లు ప్రస్తావించారు.

'రైతుల గురించి ఆలోచించే పార్టీ బీజేపీ. రైస్‌ మిల్లర్ల గురించి ఆలోచించే పార్టీ టీఆర్‌ఎస్‌. కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తే మాపై దాడులు చేశారు. కేసీఆర్‌ మాటలకు ప్రజలు ఆశ్యర్యానికి గురవుతున్నారు. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు కేంద్ర ఒప్పుకుందా? లేదా?. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దు అంటే ఎక్కడ పోసుకోమంటావు. నీ ఫాంహౌజ్‌లో పోసుకోమంటావా' అని సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. నీ 'వరి-ఉరి' కామెంట్ తో 5 గురు రైతులు చనిపోయిండ్రు. ఇప్పుడు వడ్ల కుప్పపై 6 గురు రైతులు చనిపోయిండ్రు అంటూ మండిప‌డ్డారు. నీ మూలంగా ఈ ఏడేళ్లలో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వు, నీ కొడుకు నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిండ్రు. వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వు అంటూ డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే కేంద్రంపై పడి ఏడుస్తున్నార‌ని, ఈ 7 ఏళ్లలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం 85 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు వెచ్చించిందని తెలిపారు.

Tags:    

Similar News