కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కుష్పూ సుందర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆమె సోమవారం నాడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన కష్ట సమయంలో తాను కాంగ్రెస్ లో చేరానని..ఆర్ధిక ప్రయోజనాల కోసమో..లేక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం కోసం కాదని తన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన కొంత మంది ప్రజలతో మమేకం కాలేని నాయకులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా తామేది చెపితే అది చేయాలన్నట్లు వ్యవహరిస్తున్నారని లేఖలో కుష్పూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు పనిచేసే అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే స్పందించి...కుష్పూను జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఆమె సోమవారం నాడే బిజెపిలో చేరే అవకాశం ఉంది.