కడప స్టీల్ ప్లాంట్ భాగస్వామిగా లిబర్టీ స్టీల్ ఇండియా

Update: 2021-02-23 16:25 GMT

ఏపీ కేబినెట్ మంగళవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష్తతన జరిగిన సమావేశంలో అమరావతితోపాటు కడప స్టీల్ ప్లాంట్ భాగస్వామి ఎంపిక, పలు ఇతర కార్యక్రమాలకు ఆమోదముద్ర వేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి జాయింట్‌ వెంచర్‌ ఎంపిక ప్రక్రియకు కేబినెట్‌ ఆమోదం తెలపింది. ఎస్‌.బి.ఐ.క్యాప్‌ సిఫార్సుల ప్రకారం జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఎంపికకు ఆమోదించినట్లు తెలిపారు. లిబర్టీ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ జేవీగా ఎంపిక చేశారు.తొలిదశలో రూ. 10,082 కోట్ల వ్యయం, రెండో దశలో రూ.6వేల కోట్లు వ్యయం చేయనున్నారు. జేవీపై వైఎస్ఆర్ స్టీల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీకి ఎల్‌ఓఏ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు. దీంతోపాటు వైఎస్ఆర్ జిల్లా జమ్ములమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ కు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ స్ధలంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిర్ణయం.

వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టు కింద వారికి అందుబాటు ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే కార్యక్రమం కోసం, ప్రైవేటు లే అవుట్లలోని 5 శాతం స్ధలాన్ని కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ప్రైవేటు లే అవుట్‌లో ఈ మేరకు భూ లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేయాలని నిర్ణయించింది. నవరత్నాల అమలుకు కేలండర్‌ రూపకల్పన, వసతి దీవెన, రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్‌ గేమింగ్‌ యాక్టు –1974 సవరణ తదితర అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్ధికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.

300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద నుంచి గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1 లక్షా 43 వేల 600 మందికి ఒకే ఒక్క రూపాయితో ఇళ్లను ప్రభుత్వం అప్పగించనుంది. 365, 430 చదరపు అడుగులకు సంబంధించి వారు కట్టిన మొత్తంలో 50శాతం డబ్బును సబ్సిడీ రూపంలో ఇస్తున్నట్టు సీఎం జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో 365 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.25వేలు, 430 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.50 వేలు సబ్సిడీ అందనుంది. ఈ మేరకు మినహాయించిన నగదును ప్రభుత్వం వెనక్కి ఇవ్వనుంది. టిడ్కో కాలనీలకు వైఎస్‌ జగనన్న నగర్‌గా పేరుపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అమరావతి ప్రాంతంలో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రోడ్లు), ఎల్‌పిఎస్‌ పనులు (సమీకరించిన భూముల్లో పనులు)కు సంబంధించి రూ.3వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News