‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ని ఓడించిన 46 సంవత్సరాల జగన్

Update: 2019-05-23 06:06 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాజకీయ అనుభవమే 40 సంవత్సరాలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వయస్సే 46 ఏళ్ళు. చివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు 46 సంవత్సరాల వయస్సు ఉన్న జగన్ చేతిలో మట్టికరవాల్సి వచ్చింది. ఓటమి కంటే ఈ పరిణామం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఓ కీలక పరిణామంగా మారబోతోంది. ఏపీ ప్రజలు అసలు జగన్ కుఎందుకు ఓటు వేయాలి?. ఏమి చేసి ఓటు వేయాలి అంటూ చంద్రబాబునాయుడితోపాటు టీడీపీ నేతలు అందరూ ఎదురుదాడి చేశారు. పలితాలు చూస్తే అవేమీ ఫలించినట్లు కన్పించటం లేదు. ఈ ఎన్నికల్లో అసలు తమకు జగన్మోహన్ రెడ్డి పోటీనే కాదని..తాము ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కెసీఆర్ తోనే పోరాడుతున్నామని ప్రకటించారు. చంద్రబాబు అండ్ టీం అసలు జగన్ ఉనికినే తాము గుర్తించమని.. జగన్ ను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లు వ్యవహరించారు. తీరా చూస్తే ఫలితం తారుమారు అయింది. ఏపీ ప్రజలు ఏ మాత్రం అనుభవం లేదని..పరిపాలన చేయటం రాదని చెప్పిన జగన్ కు ఓటు వేసి గెలిపించారు.

ఈ గెలుపులో జగన్ పాత్రే అత్యంత కీలకం అయితే..ఎన్నికల కీలక సమయంలో రంగంలోకి దిగిన విజయమ్మ, షర్మిల ప్రచారాల ప్రభావం కూడా కీలకంగా ఉందనే చెప్పొచ్చు. షర్మిల తీసుకొచ్చిన బై బై బాబు నినాదం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. వీటన్నింటికి తోడు దేశంలోనే పేరుగాంచిన రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చాణక్యం కూడా తీసిపారేయలేనిదే. దీనికి తోడు ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు ఎన్నో అంశాలు కలిసొచ్చాయనే చెప్పొచ్చు. 2014 ఎన్నికల్లో అనుభవం ఉందని చంద్రబాబుకు అధికారం అప్పగించినా ఆయన ఏ మాత్రం ప్రజల ఆశలు..ఆశయాలకు అనుగుణంగా పనిచేయటంలో విఫలమయ్యారనే చెప్పొచ్చు. నేలవిడిచి సాము తప్ప.. చంద్రబాబు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా వ్యవహరించి దారుణ పరాభవాన్ని మూటకట్టుకున్నారు.

 

Similar News