కుట్రల కేంద్రంగా హైదరాబాద్..చంద్రబాబు

Update: 2019-03-09 05:40 GMT

తెలుగుదేశం ప్రభుత్వం వల్లే ఏపీలో భూముల ధరలు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అదే సమయంలో రాజధానితోపాటు ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ,టీఆర్ఎస్ కలసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నాయని..జగన్ ఇంకా హైదరాబాద్ ను వదిలి రావటం లేదని విమర్శించారు. హైదరాబాద్ ను ‘కుట్రల కేంద్రం’గా మార్చారన్నారు. శనివారం నాడు చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..‘విద్యుత్ బకాయిలు ఏపీకి ఇవ్వాల్సిందేమీ లేదంటారు. ఏపికి రూ.11,278కోట్లు తెలంగాణ ఇవ్వాలి. కానీ ఏపియే రూ.2,046కోట్లు ఎదురు కట్టాలంటారు. పరిష్కరించాల్సిన బిజెపి నేతలు చోద్యం చూస్తారు. నీళ్లు సముద్రంలో కలిసినా టిఆర్ ఎస్ కు ఇష్టమే. వృధాగా పోయే నీళ్లు వాడుకున్నా కెసిఆర్ కు కన్నెర్ర. వాళ్లు కాళేశ్వరం కట్టుకోవచ్చు.

మనం ఏపిలో కట్టకూడదా..? మన ‘గోదావరి-పెన్నా అనుసందానానికి’ టిఆర్ ఎస్ అడ్డంకులు. ఏపి నదుల అనుసందానంపై దేశం మొత్తం ప్రశంస. కెసిఆర్,జగన్మోహన్ రెడ్డికి మాత్రం కన్నెర్ర. ఆంధ్రావాళ్లు ఊడిగం చేయాలనేది కెసిఆర్ ఆలోచన. ఏపి నీళ్లకు మోకాలడ్డే కెసిఆర్ తో జగన్ దోస్తీ. సొంత ప్రాంతానికి నీళ్లిచ్చినా జగన్ కు కంటిమంటే. జగన్ కు ఓటేస్తే కెసిఆర్ కు, మోదికి ఓటేసినట్లే. అందిన ఫారమ్ 7 లలో 95% బోగస్ అని అధికారే చెప్పారు. ఓట్ల తొలగింపు కుట్రలను ప్రజలే అడ్డుకోవాలి. మా ఓట్లు తొలగించి మమ్మల్నే ఓటడుగుతారా ..? వైఎస్సార్ కాంగ్రెస్ ను ప్రజలంతా నిలదీయాలి. ‘మమ్మల్ని బతికుండగానే చంపేస్తారా’ అని ప్రశ్నించాలి.

రేపు మా ఆస్తులు కూడా ఇలాగే గల్లంతు చేస్తారా..? అని రేపు బూత్ ల వద్ద ఓటర్లే వైసిపిని నిలదీయాలి. రెడ్ హ్యాండెడ్ గా డేటా దొంగలు దొరికిపోయారు. టిడిపి డేటా చోరీకి వైసిపి ‘యాక్షన్ ప్లాన్’ వెల్లడైంది. సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటారు. కానీ ఎక్కడో, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారు. వైసిపి దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టిడిపి చేతుల్లో.. ‘మధ్యాహ్నం ఒంటిగంటకు’ ఆ వివరాలు వెల్లడిస్తా. తెలుగుదేశంతో పెట్టుకుంటే ఎవరూ బాగుపడలేదు. ఆంధ్రప్రదేశ్ తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరు’. అని వ్యాఖ్యానించారు.

 

Similar News