డేటా కేసు వెలుగులోకి..తగ్గిన ఓట్ల తొలగింపు దరఖాస్తులు!

Update: 2019-03-05 10:38 GMT

ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఓటర్లలో ఎప్పటి నుంచో తీవ్ర అసంతృప్తి ఉంది. చాలా మంది అసలు ఓటు వేయటానికి కూడా ఆసక్తి చూపటంలేదు. ముఖ్యంగా యూత్ అయితే ఓటును చాలా నాన్ సీరియస్ గా తీసుకుంటున్నారు. చాలా మంది అసలు తమకు ఓటు ఉందో లేదో పోలింగ్ ముందు రోజు వరకూ చూసుకోరు. కొంత మంది మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని ఓటింగ్ లో పాల్గొంటారు. అలాంటిది ఏకంగా రోజూ లక్ష మంది తమ ఓటు తీసేయమని దరఖాస్తు చేసుకుంటారా?. అంత సీరియస్ గా ఓటు హక్కు తొలగించమని కోరతారా?. అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఇది ఎవరో ముందస్తుగా చేసిన ప్లాన్ గానే భావించవచ్చు. అంటే ప్రత్యర్ధి పార్టీలను దెబ్బతీసుకోవటానికి రాజకీయ ముసుగులో కొంత మంది చేసిన పనే అని స్పష్టమవుతోంది.

హైదరాబాద్ లో నమోదు అయిన అత్యంత కీలకమైన డాటా చౌర్యం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఓట్ల తొలగింపు దరఖాస్తుల భారీగా తగ్గిపోవటం వెనక మతలబు ఏమిటి?. సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్య ఎన్నికల ప్రధాన అధికారి జి కె ద్వివేదినే వారం రోజుల క్రితం వరకూ ఓట్ల తొలగింపు కోసం రోజుకు లక్ష దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. అదే సమయంలో ఓట్లు తొలగించాలంటూ తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై ఇప్పటివరకూ వంద కేసులు పెట్టామని తెలిపారు. తమ ఓటర్ల జాబితాలో ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలేమీ ఉండవన్నారు.

 

Similar News