చంద్రబాబుకు ‘రాజధాని’ టిక్కెట్ల టెన్షన్

Update: 2019-03-06 05:43 GMT

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నూతన రాజధాని ప్రాంతం అయిన అమరావతికి సంబంధించిన టిక్కెట్ల ఖరారు వ్యవహారం ఖరారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఓ వైపు రాష్ట్రమంతటా టిక్కెట్లు ఖరారు చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు తన ఇంటి పక్కన ఉన్న నియోజకవర్గాలను మాత్రం ఖరారు చేయలేకపోతున్నారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలు చంద్రబాబునాయుడితో సమావేశం అవుతున్నా టిక్కెట్ల వ్యవహారం మాత్రం కొలిక్కి రావటం లేదు. ఇది గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ కు కూడా టెన్షన్ పుట్టిస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతం ఉండే తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఆయనకు మళ్లీ సీటు ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ప్రకటనలు చేస్తుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో పాటు గుంటూరు ఎంపీ పరిధిలోని మంగళగిరి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ సీట్లు కూడా ఇఫ్పటివరకూ ఖరారు కాలేదు. తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ మారటంతో అక్కడి నుంచి ఎవరు బరిలో దిగుతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఖరారు అయింది తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలు మాత్రమే అని పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించిన రావెళ్ళ కిషోర్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనకి వెళ్ళిన విషయం తెలిసిందే.

గుంటూరు పార్లమెంట్ పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, దూళిపాళ నరేంద్రకుమార్ ల పేర్లే ఇప్పటి వరకూ ఖరారు అయిన జాబితాలో ఉన్నాయి. ఇదిలా ఉంటే నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఆయన ఆర్ధికంగా కష్టకాలం ఉండటం, పోలవరం ప్రాజెక్టు విషయంలో తొలుత కేంద్రానికి ఫిర్యాదులు చేయటం వంటి అంశాలు కీలక భూమిక పోషించనున్నాయని చెబుతున్నారు. అయితే రాయపాటి ఫ్యామిలీలో మాత్రం ఒక అసెంబ్లీ సీటు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజధాని రాకతో జోష్ లో ఉన్న గుంటూరు జిల్లా ప్రాంతంలో కూడా టిక్కెట్ల ఖరారు విషయంలో నెలకొన్న తలనొప్పులు ఎటువైపు దారితీస్తాయో అన్న టెన్షన్ పార్టీ నేతల్లో ఉంది.

 

Similar News