అతి పెద్ద ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాం

Update: 2019-02-26 07:00 GMT

పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపుదాడికి సంబంధించి భారత్ అధికారికంగా స్పందించింది. ఈ దాడుల ద్వారా జైషే మహ్మద్ కు చెందిన అతి పెద్ద ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసినట్లు దేశ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాకు వెల్లడించారు. బాలకోట్ లో ద్వంసమైన శిబిరంలో పెద్ద ఎత్తున జైషే ఉగ్రవాదులు..శిక్షణా సిబ్బంది, సీనియర్ కమాండోలు, జిహాదీలు హతమయ్యారని తెలిపారు. ఈ ఉగ్ర శిబిరాన్ని జైషే అధినేత మసూద్ అజర్ సమీప బంధువైన మౌలానా యూసఫ్ అజార్ అలియాద్ ఉస్తాద్ ఆధ్వరంలో కార్యకలాపాలు సాగిస్తుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

దీని కోసం ఎలాంటి చర్యలకూ వెనకాడే ప్రశ్నేలేదన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం లేకుండా టార్గెట్ గా జైషే ఉగ్రవాదుల శిబిరాన్ని మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ కేంద్రంగానే భారత్ పై ఉగ్రదాడులు జరుగుతున్నాయని..బహావల్ పూర్ నుంచి వరసగా ఉగ్రదాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు జైషే ప్లాన్ చేస్తున్నట్లు పక్కా సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా రావటంతో ఈ చర్యలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.. దాడుల కోసం ఫిదాయిన్ జిహాదీలకు శిక్షణ ఇస్తున్నారని గోఖలే తెలిపారు.

Similar News