కడప జిల్లా అధికార టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పటానికి నిర్ణయించుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ అధిష్టానం ఆయన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. మంగళవారం ఉదయం ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లా రాజంపేట నేతలతో సమావేశం అయినా కూడా ఆచితూచి వ్యవహరించారు.
ఎప్పుడైతే మేడా మల్లిఖార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు జగన్ తో భేటీ కానున్నారని తెలిసిందో..వెంటనే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే ప్రతిపక్షంలోకి వెళ్ళటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో కడప జిల్లాలో టీడీపీ బలోపేతం అవటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో జరిగిన ఘటన టీడీపీకి ఎదురుదెబ్బగా చెబుతున్నారు.