తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వటానికి తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు రాష్ట్ర ప్రజలకు చెందిన పది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయటానికి సిద్ధమయ్యారా?. అంటే ఆయనే ఔనని చెబుతున్నారు. ఆయన ట్విట్టర్ సాక్షిగా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబు అధికారిక ‘ట్విట్టర్’ ఖాతాలో ఏమి రాశారో మీరే చూడండి. ‘ ఆడపడుచులకు తెలుగింటి సంప్రదాయం పసుపు-కుంకుమ. ఓ అన్నగా మీకు నేను ఇస్తోన్న బహుమతి ఇది. దీనికి ప్రతిగా ఒకటే కోరుతున్నా. ఈ మధ్య ఓ పెద్ద మనిషి నాకు రిటర్ను గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సత్తా తెలిసేలా ఆయనకు మీరే గిఫ్ట్ ఇవ్వాలి’. ఇదీ ఆయన ట్వీట్.
అన్న అయితే ఆడపడుచులకు సొంత డబ్బులు ఇవ్వాలి కానీ సర్కారు డబ్బులు ఇస్తారా?. అయినా చంద్రబాబుకు కెసీఆర్ ఇచ్చే గిప్ట్ కు ఏపీ ప్రజల కు సంబంధం ఏమిటి?. అంటే కెసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ అంటే ‘ఓటమి’ అందకుండా ఉండటం కోసం ఏకంగా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి రెడీ అయ్యారా?. ఓ వైపు ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీలో పది వేల కోట్ల రూపాయల నిధుల కోసం రాజధాని కోసం అంటూ రైతులు ఇఛ్చిన భూములను తనఖా పెట్టేందుకు సర్కారు సిద్ధం అయింది. మరి గిఫ్ట్ లు..రిటర్న్ గిఫ్ట్ ల కోసం ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేయవచ్చా?.