తెలంగాణ ఎన్నికల్లో కీలక ట్విస్ట్. కొడంగల్ మహాకూటమి అభ్యర్ధి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన బెడ్ రూం తలుపులు ఎందుకు ఇరగ్గొట్టారని రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి భార్య కూడా తాము ఏమైనా టెర్రిరిస్ట్ లమా? అని ప్రశ్నించారు. మంగళవారం నాడు కోస్గిలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ దృష్య్టా రేవంత్ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సభ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రేవంత్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది. పోలీసుల తీరుపై రేవంత్ భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది అన్యాయానికి పరాకాష్ట అని అన్నారు. పోలీసులు తలుపు విరగగొట్టి ఇంటి లోపలకి వచ్చినట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోమని ఆమె పేర్కొన్నారు. తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత డిమాండ్ చేశారు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేదని వాపోయారు. తీవ్రవాదని ఈడ్చుకెళ్లినట్టు బలవంతంగా లాక్కెల్లి వాహనంలో తీసుకుపోయారని, ఎక్కడి తరలిస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడిగా ఆమె వర్ణించారు. నియంత పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ జడ్చర్ల పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టు చెబుతున్నారు.