తెలంగాణ బిజెపికి కొత్త ఊపు వస్తుందా?

Update: 2018-10-20 04:30 GMT

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణలో ఎలాగైనా నిర్ణయాత్మక శక్తిగా మారాలని ప్రయత్నిస్తోంది. దీని కోసం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిపూర్ణానంద శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. అమిత్‌ షా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనకు ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానంద చేరికతో దక్షిణాదిన బీజేపీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆయన సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటామన్నారు. ఇన్నాళ్లు ఆయన ఆశీస్సులు బీజేపీకి ఉన్నాయని, ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఆయన చేరికతో తెలంగాణ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించేందుకు వీలవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనతోపాటు ప్రచారం నిర్వహిస్తామన్నారు. బీజేపీలో తన చేరికపై ఎలాంటి ముందస్తు షరతులు లేవని, సామాన్య కార్యకర్తలాగే పార్టీలో చేరానని స్వామి పరిపూర్ణానంద స్పష్టం చేశారు. నవరాత్రి దీక్ష అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’అనే హిందూ సంస్కృతిని రాజకీయ కోణంలో ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు.

 

Similar News