అయ్యో యడ్యూరప్ప..పరువు పోయింది..పదవీ పోయింది

Update: 2018-05-19 11:03 GMT

కర్ణాటకలో బిజెపి పరువు పొగొట్టుకుంది. ఓ వైపు సుప్రీంకోర్టు మొట్టికాయలు. గవర్నర్ అడ్డగోలు నిర్ణయాలు. చివరి నిమిషం వరకూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు. అయినా ఫలించని ‘ప్లాన్’. చివరకు విధిలేని పరిస్థితిలో అసెంబ్లీ సాక్షిగా బలపరీక్ష ఎదుర్కోవాల్సిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప దాని కంటే ముందే సభలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో దేశ వ్యాప్తంగా బిజెపి పరువు పొగొట్టుకుంది. ఒక్క బిజెపినే కాదు...గవర్నర్ వాజూభాయ్ వాలా కూడా తన పరువు తీసుకున్నట్లు అయింది. అసలు బిజెపికి మెజారిటీ ఉందా? లేదా అనే అంశాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే కాదు..బలనిరూపణకు బిజెపి అడిగిన దానికంటే ఎక్కువ సమయం ఇఛ్చి కూడా గవర్నర్ విమర్శలు ఎదుర్కొన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకంగా నిలవబోతోందని చెప్పుకోవటంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు..పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారు. కానీ గవర్నర్ ఈ సంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కి బిజెపికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

అయినా అంతిమంగా బిజెపి పరాజయం చవిచూడాల్సి వచ్చింది. రాజీనామాకు ముందు యడ్యూరప్ప అసెంబ్లీలో మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేయటం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా పాలించే అవకాశం రాకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. అప్పుడే యడ్యూరప్ప రాజీనామాకు సిద్ధమైన విషయం తేలిపోయింది. కర్ణాటకలో రైతులకు..ప్రజలకు ఎంతో మేలు చేద్దామని అనుకున్నానని..అయినా కాంగ్రెస్, జెడీఎస్ ల అనైతిక కలయికతో ఇది సాధ్యం కావటంలేదన యడ్యూరప్ప పేర్కొన్నారు. ప్రధాని మోడీ పాలనకు మెచ్చి ప్రజలు తమకు కర్ణాటకలో 104 సీట్లు ఇఛ్చారని అన్నారు. తాజా పరిణామాలతో గత రెండు రోజులుగా కర్ణాటకలో సాగిన హైఓల్టేజ్ సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది. ఇక కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటమే మిగిలింది. యడ్యూరప్ప సభలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. ఓ వైపు సభ ముగింపునకు సందేశంగా జనగణమన వస్తున్నా యడ్యూరప్ప...బిజెపి సభ్యులు అదేమీ పట్టించుకోకుండా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

 

Similar News