Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఆయన ‘సూపర్ కమిషనరా?’

ఏపీలో ఆయన ‘సూపర్ కమిషనరా?’
X

ఐఅండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి తీరుపై మంత్రుల గుర్రు

అధికారవర్గాల్లో చర్చ

మంత్రుల పేర్లు ఉండవు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శుల పేరు ఉండవు. కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కీర్తిస్తూ తన పేరుతో మీడియాకు ప్రకటన విడుదల చేస్తారు. ఆ ప్రకటనకు తన ఫోటోను మాత్రమే జోడిస్తారు. మీడియా గ్రూపులకు పంపుతారు. ఇలా అందరినీ బైపాస్ చేస్తూ ఐఅండ్ పీఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తీరు ప్రభుత్వంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయకుమార్ రెడ్డి తీరుపై మంత్రులు గుర్రుగా ఉండగా..అధికారులు మాత్రం ఇదెక్కడి పద్దతి అంటూ అవాక్కు అవుతున్నారు. సమాచార శాఖ పనేంటి?. ఆయన చేస్తున్నదేమిటో అర్ధం కావటంలేదన్నది అధికారుల కామెంట్స్. ముఖ్యమంత్రి సీఎం జగన్ దగ్గర, మంత్రుల దగ్గర ఏవైనా కీలక సమావేశాలు జరిగితే ఆ సమావేశం వివరాలను మీడియా సంస్థలకు పంపటం సమాచార శాఖ బాధ్యత.

కానీ పలు శాఖలకు సంబధించిన అంశాలపై సమాచార శాఖ కమిషనర్ పేరుతో ఏకంగా ప్రెస్ నోట్లు విడుదల చేస్తూ..ఆయా శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శుల పేర్లు కూడా ప్రస్తావించకుండా ఆయా శాఖల వివరాలు కూడా కమిషనర్ విజయకుమార్ రెడ్డి చెప్పారు అంటూ మీడియాకు ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరింత ప్రసన్నం చేసుకునేందుకు ‘కీర్తనలు’ కూడా ప్రెస్ నోట్లో పొందుపరుస్తున్నారు. విజయకుమార్ రెడ్డి పేరు మీద బుధవారం నాడు గిరిజనులకు భూమి హక్కుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో కొన్ని పాయింట్లు ఇలా ఉన్నాయి.

‘ఇప్పటికే గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక సంస్థల పదవుల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించింది. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గిరిపుత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ‘కీర్తిస్తున్నారు’ అని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు’ ఇదీ కథ. ఇందులో ఎక్కడా సంబంధిత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కానీ.. ఆ శాఖకు సంబంధించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఊసు కానీ ఉండదు. అంటే అటవీ శాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ తర్వాత విజయ్ కుమార్ రెడ్డిదే అన్న మాట. మరి ఆ శాఖకు మంత్రి ఎందుకు?. కార్యదర్శులు ఎందుకు అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it