Telugu Gateway
Politics

మళ్లీ వేడెక్కిన గన్నవరం రాజకీయం

మళ్లీ వేడెక్కిన గన్నవరం రాజకీయం
X

కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. అధికార వైసీపీలోని గ్రూపులు బహిరంగంగా ఫైటింగ్ కు దిగాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైపీపీలో చేరినప్పటి నుంచి అక్కడ రాజకీయం గరం గరంగానే సాగుతోంది. వల్లభనేని వంశీ కూడా తాను కూడా ఒకింత తగ్గి ఉంటున్నట్లు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. శనివారం నాడు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. వల్లభనేని-దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహా బాహికి దిగారు. దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది.

ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు చెబుతున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, వంశీ మధ్య తరచూ వివాదాలు వస్తూనే ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it