Telugu Gateway
Politics

బిజెపికి తిరుపతి లోక్ సభ సీటు ఆఫర్ చేస్తున్న టీడీపీ?!

బిజెపికి తిరుపతి లోక్ సభ సీటు ఆఫర్ చేస్తున్న టీడీపీ?!
X

నడ్డాతో టీడీపీ నేతల రాయభారం!

ఇంకా అటునుంచి రాని గ్రీన్ సిగ్నల్

ఒక్క సీటు. ఎన్నో రాజకీయాలు. మరెన్నో ఎత్తుగడలు. తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నిక ఏపీలో కొత్త రాజకీయ మార్పులకు నాంది కాబోతుందా?. పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఢిల్లీ రాజకీయ సర్కిళ్లలో ఓ అంశంపై విస్తృతమైన చర్చ సాగుతోంది. తిరుపతి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీనికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ సీటును ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ బిజెపికి ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము బరిలో ఉండమని..అక్కడ బిజెపి అభ్యర్ధిని పెట్టాలని కోరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బిజెపి, జనసేన పొత్తులో అక్కడ నుంచి బిజెపినే పోటీచేసింది. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధిపై వైసీపీ ఎంపీగా వరప్రసాద్ రావు 37 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. టీడీపీ బరిలో లేకుండా బిజెపి అభ్యర్ధికే మద్దతు ఇస్తే అక్కడ రాజకీయం ఒకింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో బిజెపి, జనసేన పొత్తుపెట్టుకున్నాయి. టీడీపీ ఆఫర్ కు బిజెపి ఓకే చెపితే మూడు పార్టీలు కలసి ఒకే అభ్యర్ధిని బరిలో నిలిపినట్లు అవుతుంది.

రాజకీయం రంజుగా మారుతుంది. సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ ఒంటరిగా పోటీచేసినా ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే బిజెపికి ఈ సీటును ఆఫర్ చేయటం ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎన్నో ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నిక అయినా కలసి పోటీచేస్తే రాజకీయంగా పరిస్థితి మారిపోతుంది. చంద్రబాబు అండ్ కోపై పలు అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు సీఎం జగన్ దూకుడు చూపిస్తున్నారు. బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలపై అధికారంలో ఉండగా చంద్రబాబు అండ్ టీమ్ చేసిన విమర్శలు వారి చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకే చంద్రబాబు తిరుపతి లోక్ సభ సీటు ప్రతిపాదనను బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఓ కీలక నేత ద్వారా చేరవేశారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ బిజెపి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతిపాదన వర్కవుట్ అయితే రాజకీయంగా టీడీపీకి కూడా నష్టం జరగటం ఖాయం.

ఎన్నికలకు ముందు మోడీపై వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు మళ్ళీ ఏడాదిన్నర లోపే ఆ పార్టీతో కలవటం ఏమిటనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చంద్రబాబుకు ప్రస్తుతం పలు అంశాల్లో ‘రక్షణ’ ముఖ్యం. అందుకే ఈ ప్లాన్ అంటున్నారు. నిజంగా చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అయితే బిజెపికి ప్రయోజనం ఏ మేర ఉంటుందో చెప్పలేం కానీ..చంద్రబాబుకు మాత్రం తాత్కాలిక ఊరట లభించినట్లు అవుతుంది. అంతే కాదు...వైసీపీకి బిజెపిని ఒకింత దూరం చేసినట్లు కూడా అవుతుందని ఆ పార్టీ నేతల లెక్క. బిజెపి కూడా ఈ ఆఫర్ కు ఒప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పాత పొత్తే అంటే టీడీపీ, బిజెపి, జనసేన కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అయితే బిజెపి కూడా ఏపీలో టీడీపీ స్థానాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తుంది. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో....రాజకీయం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. చంద్రబాబు తన అవసరాల కోసం నేతలను..పార్టీని ఫణంగా పెడతారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య ప్రధాని మోడీపై చంద్రబాబు ప్రశంసలు కూడా కురిపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అలాగే బిజెపికి చాలా ఎక్కువ సీట్లు ఇచ్చి పార్టీ లీడర్లను..క్యాడర్ ను చెల్లాచెదురు చేశారని..ఇప్పుడు తాను సురక్షితంగా ఉండేందుకు దేనికైనా రెడీ అనే పరిస్థితులు ఉన్నాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it