టీఆర్పీ మోసాలపై కార్తీ చిదంబరం లేఖ
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్ పీ) కు సంబంధించి చోటుచేసుకున్న మోసాలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఈ అంశంపై ఆయన ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ శశిథరూర్ కు లేఖ రాశారు. గురువారం నాడు ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మీడియా సమావేశం పెట్టి రెండు మరాఠా ఛానళ్లతోపాటు రిపబ్లిక్ టీవీ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపి కలకలం రేపారు.
ప్రభుత్వ ప్రకటనల వ్యయం కూడా టీఆర్ పీ రేటింగ్ ఆధారంగానే ఉంటుందని..అలాంటిది తప్పుడు సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇన్ఫర్ మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను స్టాండింగ్ కమిటీ ముందుకు పిలిపించి తగు చర్యలు తీసుకోవాలని కార్తీ చిదంబరం కోరారు. ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.