పట్టాలెక్కిన ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ సినిమా తిరిగి పట్టాలెక్కింది. ఇంత కాలం కరోనాతో ఆగిన షూటింగ్ పనులు మొదలైనట్లు కన్పిస్తోంది. అంతే కాదు.. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ ను కూడా మంగళవారం నాడు విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ‘మీ ప్రేమతో మమ్మల్ని చంపుతున్నందుకు ధన్యవాదాలు. కాలం వేగంగా గడిచిపోయింది. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి మిమ్మల్ని అలరించటం మా వంతు. రేపటి వరకూ వేచి చూడండి’ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. ఇప్పుడు మంగళవారం ఎలాంటి అప్ డేట్ రానుందా అన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే.
వీరితో పాటు బాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘We RRR Back’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా చిత్ర యూనిట్ జోడించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్ర అయిన అల్లూరి సీతారామరాజుకు చెందిన టీజర్ ను ఎన్టీఆర్ వాయిస్ తో విడుదల చేశారు. దీంతో మంగళవారం వచ్చేది ఎన్టీఆర్ అప్ డేట్ అయి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మూడు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టెస్ట్ షూట్ హైదరాబాద్‌లో జరిగినట్టు సమాచారం.