హాథ్రాస్ కు బయలుదేరిన రాహుల్..ప్రియాంక
హాథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం దేశంలో దుమారం రేపుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మరోసారి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు అందరూ కాకుండా 144 సెక్షన్ ఉన్నందున రాహుల్, ప్రియాంకలతోపాటు మరికొంత మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. టాటా సఫారి వాహనాన్ని ప్రియాంక స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. రాహుల్ గాంధీ, మరో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమె వెంట ఉన్నారు. హాథ్రాస్ ఘటన వెలుగుచూసిన ఐదు రోజుల తర్వాత శనివారం అక్కడికి మీడియాను కూడా అనుమతించిన సంగతి తెలిసిందే.
ఘటనలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగిసిన నేపథ్యంలోనే మీడియాకు అనుమతినిచ్చామని పోలీసులు తెలిపారు. హాథ్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని సబ్జల్‌గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. అయితే విచారణలో భాగంగా బాధితురాలి కుటుంబానికి కూడా నార్కో టెస్ట్ లు చేయించాలని నిర్ణయం దుమారం రేపుతోంది. సిట్ ఈ మేరకు సిఫారసు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.