జె సీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు
జె సీ ప్రభాకర్ రెడ్డి వంతు అయిపోయింది. ఇప్పుడు జె సీ దివాకర్ రెడ్డి వంతు. టీడీపీ నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డిపై శనివారాం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను దూషించారనే అంశంపై 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తానంటూ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు బెదిరింపులకు దిగారు. తాడిపత్రి సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. ‘మా అనుచరులు రాక్షసులు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉన్నారు. వాళ్లు మీ రక్తాన్ని పులి, సింహాల్లాగా తాగుతారు.’’ అని దివాకర్‌రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మమ్మల్ని అధికారులు సన్మానిస్తే, మేము అధికారంలోకి వచ్చాక వారిని రెట్టింపు స్థాయిలో సన్మానిస్తాం అంటూ తాడిపత్రిలోని భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వచ్చిన ఆయన హెచ్చరించారు. ఎంత కాలం ఈ నియంత పాలన ఉంటుందో చూస్తా అని వ్యాఖ్యానించారు.
తాను వస్తున్నానని తెలిసి గనుల శాఖ అధికారులు భయంతో పారిపోయారని..ఎక్కడికి పోతారని..మళ్ళీ సోమవారం వస్తానని అన్నారు. ఇదిలా ఉంటే దివాకర్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలపై కేసు నమోదైంది. జేసీ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన మైనింగ్ అధికారులు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని తెలిపారు. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదని, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు క్వారీల్లో ఉల్లంఘన జరిగిందని, ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.