Telugu Gateway
Politics

ట్రంప్ ఆమోదించిన ఆ వ్యాక్సిన్ తీసుకోను

ట్రంప్ ఆమోదించిన  ఆ వ్యాక్సిన్  తీసుకోను
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారం హోరాహోరీగా సాగుతోంది. ఓ వైపు అధ్యక్ష అభ్యర్ధుల డిబేట్..మరో వైపు ఉపాధ్య అభ్యర్ధుల డిబేట్. తాజాగా అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల‌ ముఖాముఖి సాల్ట్‌ లేక్‌లోని కింగ్స్‌ బర్రీహాల్‌లో జరిగింది. ఇందులోనూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. కాకపోతే ఇది వ్యక్తిగత స్థాయిలో కాకుండా విధాన నిర్ణయాలపైనే సాగింది. డెమాక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రిపబ్లికన్ పార్టీ ఉఫాధ్యక్ష అభ్యర్ధి మైక్ పెన్స్ తో ఆమె చర్చలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించే కరోనా వ్యాక్సిన్ ను తాను తీసుకోబోనని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. జనవరిలోనే కరోనా వైరస్ పై సమాచారం వచ్చినా ట్రంప్ సకాలంలో స్పందించకోవటం వల్లే అమెరికాలో రెండు లక్షల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని హ్యారిస్ విమర్శించారు.

ఆర్ధిక వ్యవస్థ కూడా కుప్పకూలిందని అన్నారు. అమెరికా చరిత్రలో అత్యంత విఫల పాలన డొనాల్డ్ ట్రంప్ దే అని వ్యాఖ్యానించారు. అమెరికాలో రెండు కోట్ల మందికి మేలు చేసే ఒబామా కేర్ ను ట్రంప్ రద్దు చేశారని విమర్శించారు. ఉపాధ్యక్ష అభ్యర్ధుల చర్చలో భాగంగా కోవిడ్‌ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గ్లాస్‌ మాస్క్‌ ఏర్పాటు చేశారు. కమలా హ్యారిస్ విమర్శలను రిపబ్లిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ‍్యర్థి మైక్‌ పెన్స్ ఖండిస్తూ.. కరోనాపై ఐదు కంపెనీలు ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని తెలిపారు. కరోనా వాక్సిన్‌ రూపకల్పనలో భాగంగా ఈ ఏడాది చివరిలోగా అమెరికన్స్‌ కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువస్తామని సమాధానం ఇచ్చారు.

అమెరికన్ల ఆరోగ్యానికి ట్రంప్ ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారని పెన్స్ తెలిపారు. కోవిడ్ వ్యాప్తికి చైనానే కారణం అని విమర్శించారు. చైనా ప్రయాణాలపై నిషేధం విధించి ట్రంప్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో ట్రంప్ పనితీరు ఎంతో గొప్పగా ఉందన్నారు. ఐసిస్ ముఖ్య నేతలను అంతమొందించినట్లు తెలిపారు. ఇరాన్ కు చెందిన ఖాసిం సులేమానీని తమ ప్రభుత్వమే హతమొందించిందని తెలిపారు. మరోసారి అధ్యక్ష అభ్యర్ధుల చర్చ అక్టోబర్ 15న జరగనుంది. అయితే ట్రంప్ కు కరోనా లేదని తేలితేనే తాను చర్చలో పాల్గొంటానని జో బైడెన్ ఇఫ్పటికే ప్రకటించారు.

Next Story
Share it