Telugu Gateway
Politics

నకిలీ సర్టిఫికెట్లపై దృష్టి పెట్టాలి

నకిలీ సర్టిఫికెట్లపై దృష్టి పెట్టాలి
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం నాడు శాంతి, భద్రతల అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కెసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలన్నారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడుదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు.

సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సిఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందని, ఐతే దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా ఉందని తెలిపారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు.

తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై తక్షణ కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డిజిపి మహేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ సూచించారు.

Next Story
Share it